
Balagam: తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సినిమాలు రావడం చాలా అరుదు. తాజాగా ఓ పెద్ద బ్యానర్‌లో తెలంగాణ నటుడు, జబర్దస్త్ కమెడియన్ సిరిసిల్లకు చెందిన ఎల్దండి వేణు ఓ సాహసం చేశారు. గ్రామీణ నేపథ్యాన్ని, సామాన్య కుటుంబంలో జరిగే డ్రామాను బలగం పేరుతో తెరకెక్కించారు. చావు చుట్టూ కథ నడిపి అందరినీ ఆలోచింపజేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది తమ కథగా ఫీల్ అవుతున్నారు. తమ పక్కింట్లోల జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు. అంతలా తెలంగాణ ప్రాంత సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని రెండు పాటలు హైలెట్‌గా నిలిచాయి.
తాజాగా కాపీ వివాదం..
ఈనెల 3న విడుదలైన బలగం సినిమాపై తాజాగా వివాదం మొదలైంది. తెలంగాణకు చెందిన కమెడియన్ సినిమాను తెరకెక్కించగా, ఈ సినిమా స్టోరీ తనదే అంటూతెలంగాణకు చెందిన ఓ జర్నలిస్టు మీడియా ముందుకు వచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అటు దర్శకుడు ఎల్దండి వేణు, ఇటు కథ తనదే అంటున్న జర్నలిస్టు గడ్డం సతీశ్ ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. సామాజిక కథనాలతో గుర్తింపు తెచ్చుకున్న గడ్డం సతీశ్ బలగం కథ తానే రాసుకున్నానని చెబుతున్నారు. తన కథను వేణు కాపీ కొట్టారని ఆరోపిస్తున్నాడు.

దిల్‌రాజు అంగీకరించారా?
అయితే సతీశ్ ఈ సినిమా కాపీ అని నిర్మాత దిల్‌రాజు అంగీకరించినట్లు చెబుతున్నాడు. తాను దిల్‌రాజుతో మాట్లాడానని, మాట్లాడుకుందాం రమ్మని పిలిచారని పేర్కొంటున్నాడు. తనను రమ్మన్నాడు కాబట్టి కథ కాపీ అని దిల్ రాజు అంగీకరించినట్లే అని సతీశ్ అంటున్నారు. దర్శకుడిని అడిగితే దీనిపై ఏమీ మాట్లాడడం లేదని చెబుతున్నాడు. సినిమాను ఓటీటీకి కూడా ఇచ్చామని దిల్ రాజు చెప్పినట్లు వెల్లడించాడు.
Also Read: Watermelon: ఎండాకాలం పుచ్చకాయ ఎందుకు తినాలో తెలుసా?
కథ మూలం తానే..
అయితే వివాదానికి తెరతీసిన సతీశ్ తాను ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆశించడం లేదు. సినిమాలో కథ మూలం గడ్డం సతీశ్ అని రావాలని మాత్రమే కోరుకుంటున్నాడు. నిర్మాత దిల్ రాజు దీనికి అంగీకరించడం లేదని చెబుతున్నాడు. ఓటీటీకి ఇచ్చినందున ఇప్పుడు పేరు మార్చడం కుదరదని అంటున్నాడని సతీశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కథ కాపీ అని అంగీకరించినప్పుడు తన పేరు పెట్టడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్నాడు.
అయితే సతీశ్ ఆవేదన జన్యూన్‌గా అనిపిస్తుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. డబ్బుల కోసం అయితే సతీశ్ ఇంత బాధపడే వాడు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ వివాదానికి దర్శకుడు వేణు, నిర్మాత దిల్‌రాజు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.
Also Read: Telangana Politics: గవర్నర్ వర్సెస్ చీఫ్ సెక్రెటరీ.. తప్పెవరిది..!?