Dil Raju: సినిమా అనేది ఒక కళ… అంతకు మించి వ్యాపారం. సినిమా ఉండాలంటే వ్యాపారం జరగాలి. నిర్మాతలకు డబ్బులు రావాలి. ఒక సినిమా తీయడం నుండి దాన్ని విడుదల చేసే వరకు చాలా మంది సాయం చేయాలి. ఒక్కరితో అయ్యే వ్యవహారం కాదు. ఒకరికొకరు మద్దతు సంబంధాలు చాలా అవసరం. వ్యాపారానికి పరిచయాలు కావాల్సిందే. మరి ఈ ప్రాథమిక సూత్రాన్ని దిల్ రాజు వదిలేస్తున్నారు. ఎవరి సప్పోర్ట్ లేకుండా నేను సినిమా తీయగలను, దాన్ని విడుదల చేయగలను. నిర్మాతల మండళ్లతో, ఫిల్మ్ ఛాంబర్స్ తో నాకు పనిలేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. ఎవరినీ సంప్రదించకుండా ఒంటెద్దు పోకడ అవలంబిస్తున్నారు. సంక్రాంతికి వారసుడు విడుదల చేయడకూడదని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. దాన్ని దిల్ రాజు లక్ష్య పెట్టలేదు. మౌనంగా ఉంటూనే తెర వెనుక కథ నడిపించారు. వారసుడు చిత్రాన్ని నాకు ఇష్టం వచ్చిన తేదీన విడుదల చేస్తాను, ఎవరూ ఆపలేరని రుజువు చేశారు.
దిల్ రాజు నిర్ణయాలు పరిశ్రమలో ఆయనకు శత్రువులను పెంచేస్తున్నాయి. సంక్రాంతి చిత్రాల థియేటర్స్ పంపకాల విషయమే పరిశీలిస్తే… చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్స్, ఇండస్ట్రీ పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. వారి చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కి దూరమయ్యాడు. తాజాగా మరో రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ తో కూడా గొడవకు దిగిన సూచనలు కనిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్, సితార ఎంటర్టైన్మెంట్స్ చినబాబు ఆయనకు సన్నిహితులు అంటారు.

అయితే ఆ రెండు నిర్మాణ సంస్థలకు కూడా దిల్ రాజు ఝలక్ ఇచ్చాడు. గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన వినరో భాగ్యము విష్ణు కథ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సార్… ఫిబ్రవరి 17న విడుదల విడుదల చేస్తున్నారు. చాలా కాలం క్రితమే ఆ రెండు చిత్రాల విడుదల తేదీలు ఫిక్స్ చేశారు. అదే తేదీన తాను నిర్మాణ భాగస్వామిగా ఉన్న శాకుంతలం మూవీ విడుదల చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. దాంతో అల్లు అరవింద్, చినబాబు షాక్ తిన్నారు. కిరణ్ అబ్బవరం చిన్న హీరో, ఇక ధనుష్ అంటే కోలీవుడ్ హీరో, సార్ డబ్బింగ్ మూవీ క్రిందకు వస్తుంది. ఆ రెండు చిత్రాలకు శాకుంతలం పోటీగా వస్తే… నిర్మాతలకు నష్టం జరుగుతుంది. తాము నిర్ణయించుకున్న తేదీన ఎలాంటి చర్చలు లేకుండా దిల్ రాజు పాన్ ఇండియా మూవీ విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యాడు. ఇది అల్లు అరవింద్, చినబాబులకు కోపం తెప్పించే అంశం అనడంలో సందేహం లేదు.