Contraceptive Injection: అయితే కండోమ్. లేకుంటే వేసేక్టమీ.. ఇప్పటిదాకా కుటుంబ నియంత్రణకు సంబంధించి పురుషులు అవలంబిస్తున్న విధానాలు. ఇకపై వీటి అవసరం ఉండకపోవచ్చు.. తొడుగులు తొడగకుండా, కోతలు కోయకుండా ఒక్క ఇంజక్షన్ తో కుటుంబ నియంత్రణ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల సమయం, వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.
కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో సరికొత్త ఒరవడి సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) పురుషుల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన గర్భనిరోధక ఇంజెక్షన్‌కు నిర్వహించిన ట్రయల్స్ విజయవంతమయ్యాయి.
కుటుంబ నియంత్రణలో భాగంగా పురుషులు వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటుంటారు. లేదంటే కండోమ్ వాడుతుంటారు. అయితే వీటితో పనిలేకుండా ఐసీఎంఆర్ రివర్సబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్‌ఐఎస్ యూజీ) అనే పురుష గర్భనిరోధక ఇంజెక్షన్‌ను తీసుకొచ్చింది. దీనికి మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తిచేసింది. ఈ క్రమంలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని, ఇది సురక్షితమైనదని, అంత్యంత ప్రభావితమైనదని ఐసీఎంఆర్ తెలిపింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న 303 మంది పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.
పురుషులకు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా స్త్రీలు గర్భం దాల్చకుండా దీన్ని రూపొందించారు. పురుషులు ఈ ఇంజెక్షన్‌ను తీసుకోవడం వల్ల వీర్య కణాల్లో శక్తి తగ్గుతుంది. దీంతో మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గుతాయని ఐసీఎంఆర్ ట్రయల్స్‌లో తేలింది. దేశవ్యాప్తంగా ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా వేసెక్టమీ శస్త్రచికిత్సల కోసం వచ్చిన 303 మంది ఆరోగ్యకరమైన, లైంగిక సామర్థ్యం కలిగిన పురుషులను గుర్తించారు. వారికి 60 ఎంజీ ఆర్‌ఐఎస్ యూజీ ఇంజెక్షన్ చేశారు. ఇది 99.02 శాతం కచ్చితత్వంతో పనిచేసిందని, ఎలాంటి దుష్ప్రభావాలూ చూపలేదని అధ్యయనంలో వెల్లడైంది.