
India Earthquakes: భూకంపం.. ఇప్పుడు ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం దెబ్బకు సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 70 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలికాలంలో భూకంపంతో ఇంత భారీగా ప్రాణనష్టం జరుగడం అందరినీ ఆందోళనక గురిచేస్తోంది. 7.8 తీవ్రతతో వచ్చిన ప్రధాన ప్రకంపన, అనంతరం వందల సంఖ్యలో వచ్చిన చిరు ప్రకంపనలు ఆ దేశాల్లోని భవనాలను దారుణంగా దెబ్బతీశాయి. భూకంపంతో భవనాలు నిట్టనిలువునా కూలిపోతున్న వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రతీ భూకంపంలో అత్యధిక ప్రాణనష్టానికి అనేక కారణాలు ఉంటాయి. తుర్కియే–సిరియా భూకంపంలో భవనాలు కూలిన విధానాన్ని బట్టి దానిని నిపుణులు ‘పాన్‌కేక్ కొలాప్స్’తో పోలుస్తున్నారు.
‘పాన్‌కేక్ కొలాప్స్’ అంటే..
భవన అంతస్తులు నేల కూలే సమయంలో ఒక దానిపై మరొకటి పేర్చినట్లు కూలడాన్ని ‘పాన్‌కేక్ కొలాప్స్’ అంటారని సెయింట్ లూయీస్ రీజనల్ రెస్పాన్స్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రెగ్ ఫావ్రె తెలిపారు. భవనం ఈ విధంగా ధ్వంసమయ్యే సమయంలో భవనం శకలాల బరువు చతురస్త్రాకారంలో కింద ఉన్న ఫ్లోర్‌పై పడుతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం నిట్టనిలువునా కూలిపోయిన దృశ్యాలు చాలా మంది మదిలో ఇప్పటికీ ఉంటాయి. పాన్‌కేక్ కొలాప్స్‌కు అదే అతిపెద్ద ఉదాహరణ. ‘పాన్‌కేక్ కొలాప్స్’లో సాధారణంగా భవనం కింద నుంచి మొదలై పైభాగాలకు చేరుతుంది. సాధారణంగా భూకంప సమయంలో భవనం కింద భాగంలోని పునాదులు లేదా పిల్లర్లు దెబ్బతిని కూలుతాయి. దీంతో వాటిపైన ఉన్న నిర్మాణాలు నిట్టనిలువునా పడిపోతాయి. భూకంపాలు వచ్చిన తర్వాత ఈ విధంగా భవనాలు, వంతెనలు పడిపోతాయి.
1999లోనే గుర్తింపు..
1999లో తుర్కియేలో భూకంపం వచ్చిన సమయంలోనే ఈ సమస్యను నిపుణులు గుర్తించారు. దీంతో భవనాల కింద ఉన్న పిల్లర్లకు మద్దతుగా ఇనుప స్తంభాలు ఏర్పాటు చేయాలని, గోడలకు ఆధారంగా మరింత ఇనుము వాడాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 6.7 మిలియన్లకుపైగా ఇళ్లకు ఇటువంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి 465 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, 2021 నాటికి కేవలం 4 శాతం భవనాలకే ఈ పనులు పూర్తయ్యాయి.

అందుకే భారీ విధ్వంసం
భూకంపాలు వచ్చిన సమయంలో సాధారణ విధ్వంసాలతో పోలిస్తే.. ‘పాన్‌కేక్ కొలాప్స్’ కారణంగా జరిగే విధ్వంసం ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పైఅంతస్తుకు చెందిన సిమెంట్, కాంక్రీట్ నిర్మాణాలు మొత్తం కింద అంతస్తుపై పడిపోవడంతో వాటిల్లో చిక్కుకొన్న వారిని గుర్తించడం, రక్షించడం కూడా చాలా కష్టమైన పని అని పేర్కొంటున్నారు. ఈ రకంగా కూలిన భవనంలో గాలి చేరడానికి తక్కువ మార్గాలు ఉంటాయి. చిక్కుకుపోయిన వారు తప్పించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. తాజాగా తుర్కియేలో సంభవించిన భూకంపంలోనూ ఇలాగే భవనాలు కుప్పకూలి ప్రాణనష్టం అధికంగా జరిగింది.
హిమాలయాలకు ముప్పు..?
సువివాలమైన భారతదేశానికి పెట్టని కోటలా ఉన్న హిమాలయాలకు భారీ భూకంపాల ముప్పు ఉందని తాజా అధ్యయనం తేల్చింది. హిమాలయాల శ్రేణిలో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని చెప్పింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్‌కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీలకి చెందిన నిపుణుల బృందం ఈ విషయాలను వెల్లడించింది.
100 ఏళ్లలోపే..
‘అరుణాచల్ ప్రదేశ్ నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకూ వ్యాపించి ఉన్న హిమాలయాల శ్రేణిలో గతంలోనూ భారీ భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. కెనడా యూనివర్సిటీ నిపుణుల పరిశోధనలో ఈ తరంలోనే అంటే వందేళ్లలోపే భారీ భూకంపాన్ని చూసే అవకాశం ఉందని తేలింది.
తుర్కియే – సిరియా భూకంపంతో అయినా మనం మేల్కోకపోతే నిపుణుల హెచ్చరికలను ఖాతరు చేయకపోతే.. ఈ తరంలోనే మనమూ భూకంపంతో భారీగా నష్టపోక తప్పుదని భారతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.