Cobra Swallows Eggs: సాధారణంగా పాములు కోడిగుడ్లను తింటాయి. ఓ నాగుపాము కోళ్లఫారంలో చొరబడి మూడు కోళ్లను చంపడమే కాకుండా గుడ్లు మింగింది. కోళ్లు చనిపోడంతో గమనించిన యజమాని నాగుపాము వచ్చిందనే విషయం తెలుసుకుని పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడు వచ్చి పామును బయటకు రప్పించి దాన్ని పట్టుకుని అడవిలో వదిలేశాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్టపల్లి గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెరుకు నరేశ్ కోళ్లఫారం నిర్వహిస్తున్నాడు. కాగా సోమవారం ఫారంలో చూడగా కోళ్లు చనిపోయి ఉండటాన్ని గమనించిన నరేశ్ ఇది నాగుపాము పనే అని తెలుసుకున్నాడు. అనంతరం మండలంలో పాములు పట్టే కడమంచి పాపయ్యను రప్పించాడు.
అతడు పామును బయటకు రప్పించి పట్టుకుని అడవిలో వదిలేశాడు. పాములు గుడ్డు తింటాయి. అరిగించుకుంటాయి. కానీ ఇక్కడ ఆ పాము మాత్రం తిన్న గుడ్లను కక్కింది. పామును అడవిలో వదిలేశాక వాటిని తిన్నవి తిన్నట్లే బయటకు కక్కడం సంచలనం కలిగించింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
ఒకటికాదు రెండు కాదు ఏకంగా పన్నెండు గుడ్లు మింగింది. మింగిన వాటిని అలాగే బయటకు పంపింది. అవి పాముకు జీర్ణం కాలేదని తెలుస్తోంది. మనుషులకు లాగే జంతువులకు కూడా అజీర్తి సమస్య ఉంటుందా అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికి నాగుపాము కథ సుఖాంతం కావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.