
Cobra: మరో వారం రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత పిల్లలు ఇళ్ల వద్ద ఉంటున్నారు. సాయంత్రం ఇంటి ఆవరణలో, గార్డెన్‌లో ఆడుకుంటున్నారు. వేసవి సెలవుల్లో ఉదయం, సాయంత్రం ఆడుకుంటారు. అయితే ఎండ వేడికి తాళలేక పొదలు, కన్నాల్లో ఉండాల్సిన విష పురుగులు నీడ, చల్లదనం కోసం ఇళ్లలోకి వస్తున్నాయి. వాటిని గమనించకపోతే ప్రమాదం తప్పదు. తాజాగా ఓ ఇంటి పూల కుండీలో నాగుపాము ప్రత్యక్షమైంది. దానిని చూసిన యజమాని షాక్ అయ్యాడు.
తమిళనాడులో…
తమిళనాడు కోయంబత్తూరులోని బోతనూరు తిరుమలైనగర్ ప్రాంతంలోని ఓ ఇంటి పూల కుండీలో నాగుపాము కలకలం రేపింది. ఇది చూసిన ఇంటి యజమాని గ్రీన్‌కేర్ సంస్థకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ సినెక్ అమీన్ నాగుపామును సునాయాసంగా పట్టుకున్నాడు. పట్టుబడిన పాము దాదాపు నాలుగున్నర అడుగుల పొడవు ఉంది. ఇది చూసి కుటుంబసభ్యులతోపాటు ఇరుగుపొరుగు వారందరూ షాక్‌కు గురయ్యారు.
వేడి తాళలేక ఇళ్లలోకి..
పట్టుబడిన పామును పెరియకుళం పశ్చిమ ఒడ్డున నోయ్యల్ నదికి ఆనుకుని ఉన్న పొదల్లో వదిలేశారు. వేసవి వచ్చిందంటే కోయంబత్తూరులోని పలు ప్రాంతాల్లో చల్లటి ప్రదేశాలను వెతుక్కుంటూ పాములు సహా పలు విష జంతువులు నివాస ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తుంటాయి. ఈ ప్రాంతంలో పది రోజుల క్రితం రెండు పాములను పట్టుకుని అడవుల్లోకి వదిలారు.

సెలవుల్లో జాగ్రత్త..
వేసవి సెలవుల్లో పిల్లలంతా సాయంత్రం వేళల్లో ఆడుకోవడం, పెద్దలు కూడా నీడపట్టున సేదతీరుతుంటారు. ఈ నేపథ్యంలో పాముల బెడద నివారించాలని కోయంబత్తూర్ మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. నివాస ప్రాంతంలో పాముల సంచారంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని పేర్కొంటున్నారు. సమస్య ఏటా వేసవిలో పునరావృతమౌతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనా.. వేసవి సెలవుల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం తప్పదు. ఒకవైపు ఎండవేడితో వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మరోవైపు చల్లదనం కోసం చెరువులు, కుంటలు, బావుల్లో ఈతకు వెళితే నీటమునిగే అవకాశం ఉంది. ఇక ఇంటిపట్టున ఉన్నా.. సమీపంలోని పొదల్లో నుంచి క్రిమికీటకాలు, పాములు ఇళ్లలోకి వచ్చి కాటేసే ప్రమాదం కూడా ఉంది. అన్నిటిని గమనించుకుంటూ ఈ వేసవిని సరదాగా గడపాల్సిన అవసరం ఉంది.