
KCR- Harish Rao And KTR: బీఆర్‌ఎస్‌లో తాజా పరిణామాలు ఆ పార్టీలో చర్చనీయాంశమవుతున్నాయి. ఒకవైపు సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇస్తామని ఆరు నెలల క్రితం ప్రకటించిన గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాజాగా మరో సర్వేను తెరపైకి తెచ్చారు. ఇందులో 25 మంది సిట్టింగులను మారాస్తామని లీకు ఇచ్చారు. దీనిపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతుండగానే.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు బుధవారం రహస్యంగా భేటీ కావడం, సుమారు 4 గంటలపాటు చర్చలు జరుపడం పార్టీలోనూ, ఇతర రాజకీయవర్గాలలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఆ నాలుగు గంటలు ఏం చర్చించారు..
తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సుదీర్ఘంగా, రహస్యంగా భేటీ కావడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నాలుగు గంటలపాటు సాగిన సుదీర్ఘ మంతనాలలో ఏం చర్చించారు? కేసీఆర్ ఏం చేయబోతున్నారు? అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ విస్తరణ కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా తమకు పట్టున్న రాష్ట్రాల్లో మొదట క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి, వచ్చే ఎన్నికలలో హ్యాట్రిక్ విజయాన్ని బీఆర్‌ఎస్ ఖాతాలో వేయడానికి గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు ఏ విధంగా సాగుతున్నాయి? వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి? జాతీయస్థాయిలో పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి ఏం చేయాలి? వంటి అనేక అంశాలపై కేటీఆర్, హరీశ్‌రావుతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
మంతనాల కోసం పర్యటనలు రద్దు..
సీఎం కేసీఆర్ అత్యవర పిలుపుతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ముందే ఖరారైన పర్యటనలను రద్దు చేసుకున్నారు. హరీశ్‌రావు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటన రద్దు చేసుకోగా, కేటీఆర్ రంగారెడ్డి జిల్లా చందనపల్లి పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. ఇద్దరు ప్రగతిభవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రత్యర్థి పార్టీల బలం, బలహీనతలపై ఆరా..
రాష్ట్రంలో ప్రత్యర్ధి పార్టీల బలం, బలహీనతపైనా కేసీఆర్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి? పాదయాత్రలు చేస్తున్న పార్టీలకి, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్న పార్టీలకు ప్రజలలో మద్దతు ఏ విధంగా వస్తుంది? వంటి విషయాలను తెలుసుకున్న కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఏం చేస్తున్నారు అన్న దానిపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండేలాగా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు.
ఎన్నికల వ్యూహాల అమఎన్నికల వ్యూహాల అమలుకు ఆదేశం..లుకు ఆదేశం..
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎన్నికల వ్యూహాల అమలు చేయాలని మంత్రును ఆదేశించారు కేసీఆర్. జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాని కలెక్టరేట్లకు ముహూర్తాలు పెట్టాలని, నియోజకవర్గాలలో పూర్తి చేసిన పనులపై విస్తృత ప్రచారం చేసేలా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికలకు క్షేత్రస్థాయిలోకి పార్టీ వెళ్లడానికి కావలసిన వ్యూహాలను రచించి వాటిని అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీల దూకుడుతో బీఆర్‌ఎస్ వెనుకబడి పోకుండా చూడాలని మంత్రులకు సూచించినట్టు సమాచారం.

బీఆర్‌ఎస్ విస్తరణపైనా చర్చ..
రాష్ట్రంలో ఎన్నికలతోపాటు దేశంలో బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణపై కూడా కేసీఆర్ మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి జాతీయ మీడియాతో మాట్లాడతారని తెలిసింది. ఇక జాతీయ స్థాయిలో పార్టీ వైపు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీ నాయకుల విషయంపైనా కీలక చర్చ జరిగిందని చెబుతున్నారు.
మొత్తంగా కేసీఆర్ రాష్ట్రంలో ఈ ఏడాది జరిగే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంతోపాటు బీఆర్‌ఎస్ విస్తరణకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.