
CM Jagan- Ministers: ఇన్నాళ్లూ ఒక ఎత్తు.. ఇకపై మరో ఎత్తు అన్నట్టుంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన వేసిన రాజకీయ ఎత్తులు, ఎత్తుగడలు బాగానే వర్కవుట్ అయ్యాయి. ప్రజలను తనవైపు టర్న్ చేసుకోవడంలో ఇప్పటివరకూ సక్సెస్ అయ్యారు. అటు పార్టీని తన కంట్రోల్ లో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇటీవల ఆయన అంచనాలు తప్పుతున్నాయి. ఎత్తులు, ఎత్తుగడలు చిత్తవుతున్నాయి. ఇన్నాళ్లూ వీరవిధేయత కనబరచిన వారు, భక్తులుగా ఆరాధించిన వారే ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటుతోంది. అభివృద్ధి చేయలేదని ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంటోంది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఒకతాటిపైకి వస్తున్నారు. కలవరపెడుతున్నారు. అందుకే ఇప్పుడు కఠిన నిర్ణయాలు అమలుచేయాల్సిన అనివార్య పరిస్థితులు దాపురించాయి.
ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం నిర్వహించనున్నారు. మంత్రులకు సీఎం జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు. విశాఖ రాజధాని, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజకీయంగా అమలుచేయాల్సిన వ్యూహాలు వంటి వాటిపై మంత్రులతో చర్చించనున్నారు. అమరావతి రాజధాని ఇష్యూపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. తొలుత జనవరి 31న తుది తీర్పు వస్తుందని భావించినా.. ఈ నెల 23కు వాయిదా పడింది. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. అయితే సుప్రీం తీర్పు ఆలస్యమయ్యే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉగాది నాటికి విశాఖ నుంచి పాలనను ప్రారంభించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు క్యాంప్ ఆఫీస్ ప్రారంభించి మూడు రాజధానులకు ముందడుగు వేశామన్న సంకేతాలు పంపించాలని డిసైడ్ అయ్యారు. ఆ విషయంపైనా మంత్రులతో కూలంకుషంగా చర్చించనున్నారు.

మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా పారిశ్రామిక సదస్సు నిర్వహించనున్నారు. ఇప్పటికే పారిశ్రామికాభివృద్ధిలో వైసీపీ సర్కారు సక్సెస్ కాలేదని ఇంటా బయటా విమర్శలున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఏపీలో లేదన్న ప్రచారం సాగుతోంది. ఉన్న పరిశ్రమలను తన్ని తరిమేస్తున్నారన్న విపక్షాల ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పారిశ్రామిక సదస్సును విజయవంతంగా నిర్వహించాని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులకు హితబోధ చేయనున్నారు.
ఇటీవల పార్టీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల వ్యవహారం అధికార పార్టీని కుదిపేసింది. అయితే అసంతృప్త జాబితాలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే దీనిని ఒక ప్రాధాన్యతాంశంగా తీసుకొని కేబినెట్ లో చర్చించనున్నారు. మంత్రుల అభిప్రాయాలను సేకరించనున్నారు. జిల్లాలో వ్యతిరేక వాయిస్, ఎన్నికల నాటికి ఎదురుతిరిగే చాన్స్ ఉన్న నేతలు ఎవరు? అనేది చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాల్లో స్టడీ చేసి ఒక సర్వే రిపోర్టు జగన్ టేబుల్ పైకి వచ్చింది. దానికి అనుగుణంగా చర్చించనున్నారు. మొత్తానికైతే కేబినెట్ భేటీలో అటు రాజకీయ, ఇటు పాలనాపరమైన అంశాలను అజెండాగా తీసుకొని సీఎం జగన్ నిర్ణయాలు తీసుకోనున్నారు. కానీ గతంలో ఇండివిడ్యువల్ గా నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు మంత్రులపై ఆధారపడుతుండడం విశేషం.
