
Jagan Delhi Tour: వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్ల అప్పుల కోసం కేంద్రం వైపు చూస్తూనే ఉంది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారు. నవరత్నాలపైనే దృష్టంతా పెట్టి అభివృద్ధిని గాలికొదిలేశాని అపవాదు ఉంది. గత ఏడాది భారీగా నిధులను కేంద్రం జమ చేసింది. అవి కాక మరలా అప్పుల కోసం కేంద్రాన్ని బతిమిలాడుకుంటోంది. ఆ బాధ్యతను ఈ సారి సీఎస్ జవహర్ రెడ్డికి అప్పగించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఢిల్లీలోనే దాదాపుగా మకాం పెట్టారు. కేంద్ర మంత్రులు, అధికారులను అపాయిట్ మెంట్ల కోసం ఎదురుచూసేవారు. పిలుపు రాగానే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి లడ్డూలను, విగ్రహాలను, చిత్రపటాలను చేతబట్టకొని ఉండేవారు. వాటన్నింటిని టీటీడీ అధికారులు ఆగమేఘాల మీద రెడీ చేసి పంపేవారు. వెళ్లిన ప్రతీసారి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి అప్పులను అడిగేవారని చెబుతున్నారు. దాంతో మొహం వాచి పోయిన వారందరూ నో అపాయింట్ మెంట్ బోర్డు పెట్టేశారు.
దాంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ యాత్రలకు సిద్ధపడ్డారు. అప్పులు అవసరమైన ప్రతీసారి ఆయనే వెళ్లివచ్చేవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక తప్పక అపాయింట్ మెంట్ ఇస్తే ఈయనది కూడా అప్పుల అభ్యర్థనలే అవడంతో, తలనొప్పిగా మారిందని విసుగును బయటకు కనబడకుండా ఇబ్బందులు పడేవారని అంటున్నారు. కానీ, ఇప్పుడు వస్తామంటున్నా, కేంద్రం పెద్దలు వద్దంటున్నారు. ఆ విధంగా కేంద్ర వద్ద రాష్ట్ర పరువు మొత్తం తీసేసిన తరువాత ఇప్పుడు అప్పులు తెచ్చే బాధ్యతను సీఎస్ జవహర్ రెడ్డికి అప్పగించారు. ఆయన కేంద్రం వద్ద పడిగాపులు కాచి, తమకు ఇస్తామన్న నిధులు ఎప్పుడిచ్చినా ఫర్వాలేదు.. అప్పులకు మాత్రం అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే, అటు నుంచి స్పందన మాత్రం రాకపోతుండటంతో నిష్టూరుస్తున్నారు.

వాస్తవానికి ఏపీ ప్రభుత్వం లెక్కలేనన్ని అప్పులు చేసింది. ఆర్బీఐ వద్ద తీసుకున్న అప్పులే కాకుండా కార్పొరేషన్ సంస్థల నుంచి కూడా అప్పులు తీసుకున్నారు. ఆ లెక్కలు బయటకు చెప్పడం లేదు. వాటిని ఇవ్వాలని కేంద్రం అడుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కొత్త అప్పులను నిలిపివేసింది. అప్పుల లెక్కలు చెప్పిన తరువాతే ఇవ్వాలా వద్దా? అన్నది తేలుస్తామంటున్నది. ఒకవేళ అప్పులెన్ని తెచ్చారో చెబితే కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా పుట్టదు.
మరోవైపు సంక్షేమ పథకాలకు విడుదల చేస్తామన్న సమయం దాటిపోతోంది. పరిపాలన అవసరమైన నిధులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సరిపడా నిధులు వస్తేనే సంక్షేమ పథకాలకు బటన్ నొక్కే పరిస్థితి ఉంది. బహిరంగ సభలు పెట్టిన బటన్ నొక్కుతున్నా, అర్హులైన చాలా మంది లబ్ధిదారులకు నిధులు జమ కావడం లేదు. వారు సచివాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటువంటి వారి సంఖ్య జిల్లాల్లో చాలానే ఉంది. అభివృద్ధి పనులు చేపట్టిన వారికి నిధులు విడుదల కాక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.