CM Jagan- MLAs: ఏపీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు మరో అవకాశమిచ్చారు. మారండి.. పనితీరు మెరుగుపరచుకోండి అని ఆదేశించారు. లేకపోతే మార్చేస్తానని కూడా హెచ్చరించారు. గత ఉగాది నుంచి వరుసగా వర్క్ షాపులు నిర్వహిస్తూ వచ్చిన జగన్ రిసెంట్ గా ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష చేశారు. 32 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని తేల్చేశారు. వారు ప్రజలతో మమేకం కావడం లేదని.. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కష్టమని ముఖానే చెప్పేశారు. ఈ జాబితాలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజనీ పేర్లు ఉండడం విశేషం. అందరి పేర్లు చదివి వినిపించిన జగన్ వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మూడుసార్లు చెప్పిచూశానని.. అయినా మారలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మారండి.. లేకుంటే మార్చేస్తానని సుతిమెత్తగా హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రుల్లో టెన్షన్ నెలకొంది.

ఇక్కడ నుంచి 100 రోజులు పార్టీకి కీలకమని చెప్పిన జగన్… ఈ మూడు నెలల పాటు గడపగడపకూ మన ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఏప్రిల్ లో మరోసారి వర్క్ షాపు నిర్వహిస్తామన్నారు. ఈలోగా పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. అప్పటికీ మారకుంటే ఇక మీ ఇష్టమని తేల్చేశారు. సర్వే రిపోర్టు ఫలితాల్లో పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. సరిగ్గా ఫలితాలు రాకుంటే మార్చేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఏప్రిల్ లో సర్వే రిపోర్టుల ప్రకారం అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తానన్నారు. అయితే అధినేత ఒక్కసారిగా కఠువుగా మాట్లాడేసరికి ఎమ్మెల్యేలు, మంత్రులు ఓకింత షాక్ కు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉందని.. లేకుంటే సీఎం జగన్ ఇంతలా మాట్లాడరని చాలా మంది అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యే.. ఆపై మంత్రి బాధ్యతలు నిర్వర్తించినప్పుడు క్షణం తీరిక లేకుండా గడుపుతామని.. అది అర్ధం చేసుకోకుండా గడపగడపకూ వెళ్లడం లేదని సీఎం జగన్ అనడం ఎంతవరకూ సమంజసమని మంత్రులు నొచ్చుకొంటున్నారు. పైగా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ముందు పేర్లు చదవడం ఏమిటని బాధిత మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా నాయకుల వద్ద తమను చులకన చేయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే మంత్రులం కానీ ఒక విధులు లేవు.. నిధులు లేవని.. పైగా పార్టీ బాధ్యతలు, లేనిపోని తలనొప్పులు తమకు అప్పగిస్తున్నారని వాపోయారు. అటు పేర్లు చదివిన ఎమ్మెల్యేలు సైతం సీఎంతో పాటు హైకమాండ్ పై ఆగ్రహంతో ఉన్నారు. అన్ని మీరు చేసి ఇప్పుడు ప్రజల గడపకు మమ్మల్ని వెళ్లమంటున్నారని.. ఆ నిలదీతలు, ప్రశ్నలు మేము తట్టుకోలేమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఇవ్వండి.. లేకపోయినా పర్వాలేదని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు.

151 మంది ఎమ్మెల్యేలుంటే.. వారిని కాదని పీకే టీమ్ లోని 100 మంది సభ్యులకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. వారి మాటకే జీ హుజూర్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వారే గెలిపిస్తారని నమ్ముతున్నారు. పార్టీకైనా, ప్రభుత్వానికైనా వారిచ్చిన నివేదిక అల్టిమేట్ గా మారింది. దీనిపై వైసీపీలో భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో వ్యూహకర్త వ్యూహాలు పనిచేశాయని.. ఈసారి వర్కవుట్ అయ్యే చాన్సే లేదని పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం ఐ ప్యాక్ టీమ్ కే ప్రాధాన్యమిచ్చి.. వారు ఏది చెబితే అదే చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది పేర్లు ప్రకటించడం, అందులో మంత్రులు ఉండడం.. వారందరికీ చివరి చాన్స్ అని జగన్ హెచ్చరించడంతో పార్టీలో ఓ రకమైన అసంతృప్తి రాగాలు పెల్లుబికుతున్నాయి. ఏప్రిల్ నాటికి ఇవి మరింత రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.