Waltair Veerayya: చిరంజీవికి పరిశ్రమలో భోళా శంకరుడు అనే పేరుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి, సాయం చేయడానికి అందరికంటే ఒక అడుగు ముందుంటారు. అలాగే చిరంజీవిది కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం కూడాను. సంతోషమైనా, బాధైనా వెంటనే రియాక్ట్ అవుతారు. ఫ్యాన్స్ తో పంచుకోవాలి అనుకుంటారు. ఈ క్రమంలో తన సినిమాల నుండి ఆయనే స్వయంగా లీకులు ఇవ్వడం కూడా మనం చూడొచ్చు. ఆచార్య టైటిల్ ప్రకటించకుండానే చిరంజీవి ఫ్లోలో బయటకు చెప్పేశారు. తాజాగా వాల్తేరు వీరయ్య మూవీపై స్వయంగా లీకులు ఇస్తున్నారు.

వాల్తేరు వీరయ్య టీం ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్నారు. సౌత్ ఫ్రాన్స్ లో గల ఆల్ప్స్ పర్వతాల్లో సాంగ్ షూట్ చేస్తున్నారు. మామూలుగానే చలి పుట్టించే ఆ ప్రాంతం వింటర్ లో పూర్తిగా మంచుతో కప్పబడుతుంది. డే అండ్ నైట్ మంచు కురుస్తూనే ఉంటుంది. మైనస్ 8 డిగ్రీల చలిలో చిరంజీవి-శృతి హాసన్ పై సాంగ్ షూట్ చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వీడియో సందేశం ద్వారా తెలియజేశాడు.
ఆల్ఫ్ప్ పర్వతాల్లోని అందాలు, అక్కడ ప్రతికూల పరిస్థితులు అభిమానులతో పంచుకున్నారు. చలిలో స్టెప్స్ వేయడం చాలా కష్టం అనిపించిందన్న చిరంజీవి అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టాన్ని అయినా భరిస్తాను అన్నారు. అలాగే మంచు దుప్పట్లో కప్పబడిన అందమైన లొకేషన్స్ స్వయంగా తన మొబైల్ లో షూట్ చేసి విడుదల చేశారు. అయితే చిరంజీవి-శృతి హాసన్ పై షూట్ చేసిన ఆ సాంగ్ నుండి చిన్న బిట్ చిరంజీవి లీక్ చేశారు.

‘నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి అవుతా’… అని దేవిశ్రీ పాడిన లిరిక్స్, సాంగ్ లోని శృతి, చిరంజీవి లుక్స్ ఆయన లీక్ చేశారు. దీనికి సంబంధించిన చిరంజీవి ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రత్యేక విమానంలో ఈ సాంగ్ షూట్ కోసం చిరంజీవి ఫ్యామిలీతో పాటు ఫ్రాన్స్ వెళ్లారు. ప్రొఫెషన్ తో పాటు కుటుంబ సభ్యులతో అలా ఫ్రాన్స్ లో విహరించనున్నారు. ఇక వాల్తేరు వీరయ్య మూవీ జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈసారి వీరసింహారెడ్డి, వారసుడు చిత్రాలు సంక్రాంతి రేసులో తలపడనున్నాయి. ముగ్గురు పెద్ద హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.