Telangana Surveys : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని సమాచారం ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. ఎలాగైనా గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక పాఠంతో అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలమేంటో తెలుసుకునేందుకు నేరుగా గ్రామాల్లోకి తమ బృందాలను పంపుతున్నాయి.. ప్రతి ఓటరు ను కలుసుకొని వారి నాడి ఏంటో పసిగడుతున్నాయి.

-బీఆర్ఎస్ లో రహస్య బృందం
భారత రాష్ట్ర సమితి విషయానికొస్తే… ఇప్పటికే తెలంగాణలో ఈ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.. ఇప్పుడు మూడోసారి కూడా అధికారంలోకి రావాలని ఉబలాటపడుతున్నది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత కూడా ఎదుర్కొంటున్నది. అయితే దీనిని కేంద్రం వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం దక్కడం లేదు. ఇదే సమయంలో దేశ రాజకీయాల్లోకి కెసిఆర్ వెళ్లిన నేపథ్యంలో కొద్దో గొప్పో మార్పు ఉంటుందని భారత రాష్ట్ర సమితి నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో కెసిఆర్ తన రహస్య బృందంతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ బృందం 119 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు ఆ సర్వే బృందం నివేదిక ఇచ్చింది. ఆ మధ్య ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఇలాంటి నివేదిక ఇవ్వడంతో కెసిఆర్ డైలమాలో పడ్డారు.. అయితే ఇప్పటికిప్పుడు ఆ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోనని చెబితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి, అందరికీ టికెట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ తెర వెనుక మాత్రం జరిగేది వేరుగా ఉంది. అయితే ఈసారి టిక్కెట్లు ఆ నివేదిక ఆధారంగానే ఇస్తారని తెలుస్తోంది.
-కాంగ్రెస్ లో..
కాంగ్రెస్ పార్టీది మరింత విచిత్రమైన పరిస్థితి.. ఇందులో ఎవరు పార్టీకి విధేయులో, ఎవరు కోవర్టులో ఇప్పటికీ చిదంబర రహస్యమే. సునీల్ కనగొలు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన బృందమే క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది. అయితే ఈ బృందం సభ్యులు చేస్తున్న ప్రచారం వల్ల తమకు ఇబ్బంది కలుగుతున్నదని భావించి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను సునీల్ ఆఫీసు మీదకు పంపింది.. వారు కీలక పత్రాలు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.. అయితే సునీల్ కనగొలు బృందం జరిపిన సర్వేలో కొత్త వారికి అవకాశాలు ఇస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపినట్టు సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
-బిజెపిలో అంతా అధిష్టానమే
భారతీయ జనతా పార్టీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎందరు అభ్యర్థులు ఉన్నారంటే? ఇందుకు సమాధానం లేదు అనే వస్తుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటే ఆ పార్టీ నే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రచారం చేసుకుంటున్నది. సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది . దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయాల తర్వాత… ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ.. ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. ఇదే సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి పెద్దలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే చేరికలను భారీగా ప్రోత్సహిస్తున్నారు.. అంతేకాదు నియోజకవర్గాల పరిధిలో ఎవరి బలం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసేందుకు బిజెపి కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది. అయితే వీరు ఇచ్చిన నివేదిక ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది.. స్థానిక నాయకత్వం లేకుండా నేరుగా ఢిల్లీ నుంచే ఈ బృందాలు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్నప్పటికీ తెలంగాణలో ఇప్పుడే ఆ సందడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేసినప్పటికీ… ఊహగానాలు ఆగడం లేదు. అదే సమయంలో ఆయా రాజకీయ పార్టీలు తమ సర్వేలను ఆపడం లేదు. సరి కదా ఆ జోరును మరింత పెంచాయి. ఇది మునుముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియదు.. కానీ ఆశావహుల్లో మాత్రం ఒకింత టెన్షన్ నెలకొంది.