Chiranjeevi- Surekha: చిరంజీవి పెద్ద స్టార్ అవుతాడని ముందుగా నమ్మిన వ్యక్తి అల్లు రామలింగయ్య. నటుడిగా ఒక స్థాయిలో ఉన్న ఆయన కనీస గుర్తింపు లేని చిరంజీవిని అల్లుడు చేసుకోవాలి అనుకోవడం నిజంగా గొప్ప విషయం. 1978లో చిరంజీవి ప్రాణం ఖరీదు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. రెండో చిత్రం మనవూరి పాండవులు. ఈ సినిమాలో రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య కీలక రోల్స్ చేశారు. మురళీమోహన్, కృష్ణంరాజులతో పాటు చిరంజీవి ఒక హీరోగా చేశారు.

చిరంజీవిని అల్లుడు చేసుకోవాలనే బీజం అక్కడే పడింది. సురేఖతో తన వివాహం జరగడానికి ముందు జరిగిన తంతును చిరంజీవి అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల్లో వెల్లడించారు. ఆ వేదికగా చిరంజీవి చేసిన కామెంట్స్.. సురేఖ అంటే ఆయనకు ఇష్టం లేదని. బలవంతంగా అంటగట్టారని చెప్పినట్లుంది. బలికి తీసుకెళ్లే గొర్రెపోతు మాదిరి పెళ్లి పీటల వైపు మళ్లించారని చిరంజీవి చెప్పడం అనేక అనుమానాలకు దారితీసింది.
చిరంజీవి మాట్లాడుతూ… మనవూరి పాండవులు మూవీలో అల్లు రామలింగయ్య గారితో పరిచయం ఏర్పడింది. ఆ మూవీ సెట్స్ లో ఆయన నన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రోజే ఆయన కన్ను నా మీద పడింది. నాకు తెలియకుండా నాలోని గుణాలు గమనిస్తూ టిక్ పెట్టుకుంటున్నారు. అల్లు రామలింగయ్య గారికి సురేఖను నాకు ఇవ్వాలా లేదా అనే సందిగ్ధత ఉంది. అరవింద్ మాత్రం డిసైడయ్యారు.

మనవూరి పాండవులు నిర్మాత జయకృష్ణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య కలిసి ఒక కుట్ర పన్నారు. మా నాన్నగారి అడ్రెస్ కనుక్కున్నారు. నేరుగా మా నాన్న దగ్గరకు జయకృష్ణ వెళ్లారు. పరిశ్రమలో పరిస్థితులు బాగోలేవు. అబ్బాయి అందానికి ఎవరో ఒక అమ్మాయి వలలో వేసుకోవడం ఖాయం. అల్లు రామలింగయ్య గారి అమ్మాయి సురేఖ ఉంది. మంచి గుణాలు కలిగిన అణకువ కలిగిన అమ్మాయి. చిరంజీవికి ఇచ్చి చేద్దాం అన్నారు. జయకృష్ణ మాటలకు ప్రభావితమైన నాన్నగారు పెళ్లి చేసుకోవాల్సిందే అని ఇబ్బంది పెట్టాడు.
పెళ్లి చూపులు అన్నారు. తర్వాత పెళ్లి అని నిర్ణయించేశారు. నాకేమో చేతినిండా సినిమాలతో ఖాళీ లేదు. కేవలం పెళ్లికి మూడు రోజుల సెలవు దొరికింది. పెళ్లి పీటలపై నేను చిరాకుతో ఉంటే అల్లు రామలింగయ్య ముఖం మాత్రం వెలిగిపోతుంది. పెళ్లి రోజు చిరాకు పడినా నాకు మంచి ఫ్యామిలీ దొరికిందని అర్థమైంది. నాలో కొడుకుని చూసుకున్న అల్లు రామలింగయ్య అంచెలంచెలు ఎదుగుతుంటే సొంత కొడుకు అభివృద్ధి చెందినట్లు సంతోషపడ్డారు అన్నారు.