Pawan Kalyan- Jagan: గత ఎన్నికలకు ముందు వైసీపీ రకరకాల జిమ్మిక్కులు చేసింది. అన్న క్యాంటీన్లు బదులు రాజన్న క్యాంటీన్లు నడిపింది. మంత్రి రోజాలాంటి వారైతే అన్న క్యాంటీన్లలో అందిచే భోజనం.. ఒక భోజనమేనా.. మేము చక్కనైనా ఆహారం అందిస్తాం చూడండి అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. తీరా ఎన్నికల తరువాత రాజన్న క్యాంటీన్లు లేదు.. తొక్కలేదు అన్నరీతిలో ఎక్కడికక్కడే ముగించేశారు. అటు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను సైతం మూతపడేలా చేశారు. అటు వైఎస్సార్ కుటుంబం పేరిట ఒక కార్యక్రమాన్ని విపక్షంలో ఉన్నప్పుడు ప్రారంభించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక చాప చుట్టేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్నీ గుర్తుకొస్తున్నట్టున్నాయి. అందుకే ఏదైనా కొత్తగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏం చేస్తామన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ లా చేస్తే పోలే అన్నట్టు ఐ ప్యాక్ బృందం సలహా ఇచ్చిందట. దీంతో ఒక్కో కార్యక్రమాన్ని రూపొందించే పనిలో పడ్డారు.

అటు ఒకేఒక్కడు సినిమా తరహాలో ప్రజాదర్భార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జగన్ భావించారు. అయితే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కనుక విపరీతమైన జనామోదం ఉంది.. కదా మనకెందుకులే అనుకున్నారేమో కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. జగనన్నకు చెబుదాం అంటూ ఒక కొత్త షో మొదలు పెట్టడానికి తాజాగా నిర్ణయించారు. అయితే నవంబరు ఫస్ట్ వీక్ లో ప్రారంభిస్తామనుకున్నా.. ఎందుకో కార్యక్రమాన్ని నెల చివరకు వాయిదా వేశారు. అయితే కార్యక్రమానికి స్పందన మాత్రం పవన్ కళ్యాణ్ దే. ఇప్పటికే జనసేన జనవాణి కార్యక్రమం పేరిట గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తోంది. దీనికి విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో దిగ్విజయంగా పూర్తయ్యింది. మొన్న విశాఖలో నిర్వహిస్తామనుకుంటే వైసీపీ ప్రభుత్వం అడ్డుతగిలింది.
అయితే విపక్షంలో ఉన్నారు.. కనీసం ఎమ్మెల్యేలు కూడా లేరు. అయినా ప్రజావాణి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుండడం జగన్ ను ఆకర్షించిందట. అటువంటి కార్యక్రమం చేస్తే పోలే.. అన్నట్టు ఐ ప్యాక్ బృందాన్ని సలహా అడిగారుట. ఇంత పెద్దగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు కదా.. మీపై ప్రజలకు అపార నమ్మకం కుదిరింది… అందుకే సమస్యలు చెప్పుకోవడానికి మంచి వేదికగా నిలుస్తుందని ఐ ప్యాక్ సారధి రుషిరాజ్ సలహా ఇచ్చారుట.

దీంతో నవంబరు నెలాఖరు నుంచి పట్టాలెక్కించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం స్పందన అన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో సంక్షేమ పథకాలు అందలేదని.. అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నారు. ఇప్పుడు జగనన్నకు చెప్పుకుందాం ద్వారా ఇటువంటి ఫిర్యాదులు రెట్టింపయ్యే అవకాశముందని ప్రభుత్వ అధికారులు భయపెడుతున్నారు. పవన్ విపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఆయన వద్దకు వెళుతున్నారు. మనం అధికారంలో ఉన్నాం. మన వైఫల్యాలే చెబుతారే తప్ప…మరేమీ ఉండదని అధికార గణం చెబుతున్నా జగన్ చెవినెక్కించుకోవడం లేదట.