China : నిచ్చెనలు.. మెట్లు.. అన్నీ ఒక్కటే.. పైకి వెళ్లేందుకు ఉపయోగపడే సాధనాలే. ప్రస్తుతం నగరాల్లో ఎత్తయిన భవనాలు ఉంటున్నాయి. ప్రతీ భవనానికి మెట్లు ఉంటాయి. అయితే మెట్లు ఎక్కేవారు తగ్గిపోతున్నారు. ఒక ఫ్లోర్ ఎక్కగానే ఆయాసం, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా లిఫ్ట తెచ్చుకున్నారు. అందులో నిలబడితే చాలు అదే ఏ ఫ్లోర్ కావాలో.. ఆ ఫ్లోర్‌కు తీసుకెళ్తుంది. అయితే లిఫ్ట్ ప్రయాణంతో చాలా బద్ధకంగా మారిపోతున్నాం. శారీరక వ్యాయామం ఉండడం లేదు. రోగాలు శరీరంలో పెరుగుతున్నాయి. ఇక ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది భయపడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో వింతగా, విచిత్రంగా ఆలోచించే చైనీయులకు ఓ ఆలోచన వచ్చింది. అతిపెద్ద నిచ్చెన ఏర్పాటుచేసి ఎవరైనా ఎక్కగలరా అని ప్రపంచ వ్యాప్తంగా ధైర్యవంతులైన పర్యాటకులకు సవాల్ విసురుతోంది. అత్యంత ప్రమాదకరమైన పర్వత ప్రాంతంలో రెండు కొండలను కలుపుతూ ఈ భారీ నిచ్చెన ఏర్పాటు చేశారు.
నిటారు నిచ్చెన..
ప్రమాదకరంగా ఉన్న కొండలను కలుపుతూ పట్టుకుంటే జారిపోయేంత సున్నితమైన, నునుపైన నిటారు నిచ్చెన ఏర్పాటు చేశారు. దీనిని ఎక్కేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. క్యూ కడుతున్నారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్ జియాజీ నేచర్ పార్కులోని మౌంట్ క్విజింగ్ కొండ నుంచి సమీపంలోని కొండకు ఈ పొడవైన నిచ్చెన నిర్మించారు. నేలపై నుంచి ఏకంగా 5 వేల అడుగుల ఎత్తులో 551 అడుగుల పొడవున ఈ టీయాంటీ నిచ్చెనను ఎక్కాల్సి ఉంటుంది. టీయాంటీ అంటే చైనా భాషలో ఆకాశానికి నిచ్చెన అని అర్థం. రోజూ 1,200 మందికిపైగా జనం ధైర్యంగా దీనిని ఎక్కేస్తున్నారు. చాలా మంది భయంతో వెనుదిరుగుతున్నారు.
చాలా మంది సగం వరకే..
ప్రమాదకరంగా ఉన్న ఈ మెట్లు సగం ఎక్కాక కిందకు చూస్తే కళ్లు తిరగడం ఖాయం. కింద మొత్తం లోయలా ఉంటుంది. అందుకే చాలా మంది కోటి రూపాయలు ఇచ్చినా నిచ్చెన ఎక్కంబాబోయ్ అంటున్నారు. ఇక ఈ నెచ్చెన ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. నిచ్చన ఎక్కకుండానే చాలా మంది వామ్మో అంటున్నారు.
టికెట్ ధర ఎక్కువే..
ఇక ఈ నిచ్చెన ఎక్కడానికి టికెట్ కొనాలి. ఒక్కరి నుంచి రూ.8,500 వసూలు చేస్తున్నారు. ఇక నాలుగు అడుగులకన్నా ఎక్కువ ఎత్తు ఉన్నవారిని మాత్రమే నిచ్చెన ఎక్కడానికి అనుమతి ఇస్తున్నారు. చైనాలో సాహస క్రీడలు ఆడేవారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది వీరి సంఖ్య 40 కోట్లకు చేరింది. దీంతో చైనా ఇలా సాహసమైన కార్యక్రమాలు, క్రీడలు నిర్వహిస్తోంది.