
CM Jagan: ఏపీలో రాజకీయ నిర్ణయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్షం బలం పుంజుకుంటున్న వేళ, ఇక మరింత అవకాశం ఇచ్చేందుకు సమయం ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యూహం మార్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. పూర్తికాలం ప్రభుత్వం పరిపాలన చేస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నా, తాజా పరిస్థితుల నేపథ్యంలో జగన్ మదిలో మరో విధంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. వై నాట్ 175 అన్న ఆయన ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. వెనక్కి తగ్గి మడమ తిప్పాల్సి వస్తుందోనన్న ఆందోళన జగన్‌లో ప్రస్ఫుటమవుతుంది. ఇటీవల గవర్నర్ తో భేటీ అవుతున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. పలువురు మంత్రులకు ఉద్వాసనకు పలికి కేబినేట్ లోకి కొత్త మంత్రులు తీసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆయన, మరోసారి ఢిల్లీకి వెళ్లారు. అర్థరాత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వ్యతిరేకంగా వీస్తుందని వైసీపీ అధిష్టానానికి రిపోర్టులు అందాయి. ఎమ్మెల్సీ ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సక్సెస్ అవుతోంది. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. అధికార పక్షంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అందరూ సిద్ధమవుతున్న వేళ, జగన్ ముందస్తు ఆలోచనను తెరపైకి తీసుకువస్తే, టీడీపీ, జనసేనల దూకుడుకు కళ్లేం వేయవచ్చని వ్యూహమై ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.
జగన్ ఢిల్లీ యాత్రలు, గవర్నర్ తో భేటీ వార్తలపై ప్రతపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. కాదు రాష్ట్ర సంక్షేమం కోసమేనని సాక్షి మీడియా కోడై కూస్తోంది. మరోవైపు, తెలంగాణాతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని జగన్ రహస్య ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారాయి. తేదీలు కూడా ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో పార్టీ శ్రేణుల పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. నవంబరులో నామినేషన్లను ఆహ్వానించి, డిసెంబరులో పోలింగ్ ముగించేస్తారని ఆ వార్తల సారాంశం. ఒకవేళ అదే నిజమైతే రాష్ట్రంలో అన్ని పార్టీల్లోను టెన్షన్ పీక్ స్థాయికి చేరిపోతోంది. ఫలితంగా సీబీఐ, ఈడీ కేసుల వ్యవహారం కూడా ప్రజలు మరిచిపోయి, అందరూ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోతారని కూడా భావిస్తుండవచ్చు. ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని మరలా పరిస్థితులు చక్కబెట్టుకోవచ్చని భావిస్తుండొచ్చు. ఏమో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.