Chandrababu- WhatsApp: ఏదైనా సమస్యలు వచ్చినప్పుడే జనాలకు బాధ తెలుస్తుంది. వాట్సాప్ ఈ మధ్యాహ్నం ఆగిపోగానే జనాలకు ఆ బాధ బాగా తెలిసివచ్చింది. వాట్సాప్ తోనే ఇప్పుడన్నీ ముడిపడి ఉన్నాయి. ఆఫీసు పనులు.. ఇంటిపనులు.. సమాచార సేకరణ.. బట్వాడా? బాగోగులు తెలుసుకోవడాలు.. మీడియాలో వార్తలు పంపడాలు.. ఇలా అన్నింటికి మూలధారమైన వాట్సాప్ ఆగిపోతే అందరూ స్ట్రక్ అయిపోయిన పరిస్థితి.

అయితే వాట్సాప్ ఆగిపోవడాన్ని కూడా కొందరు సృజనశీలురు దాన్ని అడ్వంటేజ్ గా తీసుకున్నారు. తమ మెదడుకు పదును పెట్టి ట్రోల్స్, మీమ్స్ చేస్తూ అటు వాట్సాప్ ను.. ఇటు తమ ప్రత్యర్థులను ఎండగట్టడంలో విజయం సాధించారనే చెప్పాలి.
వాట్సాప్ బంద్ కాగానే అందరూ ట్విట్టర్ లోకి వెళ్లిపోతున్నామంటూ మీమ్స్ హోరెత్తించారు. అంతర్జాతీయంగా ట్విట్టర్ లో ఇది ట్రెండ్ అయిపోయింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు చంద్రబాబును వాడేసుకొని చేసిన మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
‘హైదరాబాద్ కట్టింది నేనే.. హైదరాబాద్ కు ఐటీ తెచ్చింది నేనే.. మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్లను ఇంజినీరింగ్ తీసుకొమ్మని చెప్పింది నేనే’ అంటూ ఊదరగొట్టే డైలాగులు చెప్పే చంద్రబాబును ‘వాట్సాప్ ఆగిపోయిన సమయంలో ’ కొందరు నెటిజన్లు ఆడేసుకున్నారు.

‘ఫలించిన చంద్రబాబు కృషి.. పనిచేస్తున్న వాట్సాప్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు’ అంటూ మీమ్స్ క్రియేట్ చేసి కొందరు నవ్వులు పూయిస్తున్నారు. ఇక వాట్సాప్ డౌన్ అయ్యింది మీ హెల్ప్ కావాలంటూ దాని అధినేత జుకర్ బర్క్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసినట్టు.. ‘హలో బ్రదర్… మన వాళ్లు బ్రీఫిడ్ మి.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్’ అంటూ చంద్రబాబు సమాధానమిచ్చి ధైర్యం చెప్పిన మీమ్ కూడా వైరల్ అయ్యింది. చంద్రబాబు గతంలో ‘ఓటుకు నోటు ’కేసులో మాట్లాడిన డైలాగులపై సెటైరికల్ గా చేసిన ఈ మీమ్ అదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు. ఇలా వాట్సాప్ డౌన్ అయినవేళ సందర్భానుసారం నెటిజన్లు పంచిన మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి.