
Chaitanya Allegations On Lingamaneni: వారిద్దరూ పారిశ్రామికవేత్తలు. ఒకరు విద్యాసంస్థల అధినేత, మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. వారి మధ్య వందల కోట్ల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో రాజకీయ లింకులు ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. తనను లింగమనేని రమేష్ రూ.300 కోట్లకుపైగా మోసం చేశాడని చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు తాజాగా ఆరోపించారు. చాన్నాళ్లుగా వారి మధ్య డబ్బు వివాదం నడుస్తోంది. న్యాయస్థానాల్లో కేసులు సైతం నడుస్తున్నాయి. ఇంకా తీర్పు వెలువడక ముందే బీఎస్ రావు మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ప్రోత్సాహం ఉందన్న టాక్ నడుస్తోంది.
బీఎస్ రావు చైతన్య విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. లింగమనేని రమేష్ రియల్ ఎస్టేట్ నిర్వహిస్తుంటారు. తన చైతన్య సంస్థలకు భూముల సేకరణ, భవనాల నిర్మాణం కోసం కొన్నేళ్ల కిందట బీఎస్ రావు రూ.300 కోట్లను లింగమనేని రమేష్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అనుకున్నట్టుగా భూములు కానీ.. భవనాలు కానీ లింగమనేని రమేష్ అందించలేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. సుప్రీం కోర్టు వరకూ కేసులు పెట్టుకున్నారు. అయితే దీనిపై సడెన్ గా బీఎస్ రావు మీడియా ముందుకొచ్చి రమేష్ పై ఆరోపణలు చేయడంతో విషయం బయటపడింది. చైతన్య విద్యాసంస్థలు మీడియా సంస్థలకు పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తుండడంతో బీఎస్ రావు ఆరోపణలకు విశేష ప్రాచుర్యం లభించింది.

అయితే ఉన్నపలంగా బీఎస్ రావు బయటకు రావడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. లింగమనేని రమేష్ కు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. కృష్ణా నది కరకట్టలపై చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు లింగమనేని రమేష్ దే. అందుకే వైసీపీ నేతలు రమేష్ పై టార్గెట్ పెట్టుకున్నారు. ఆయనపై ఎన్నోరకాలుగా కేసులు నమోదు చేశారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో బీఎస్ రావు తెరపైకి రావడం అనుమానాలకు తావిస్తోంది. దాని వెనుక అధికార పార్టీ ప్రోత్సాహం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఇదంతా రాజకీయ కోణంలో జరుగుతోందని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు.