Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో వేగం పెరిగిందా? సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోందా? తెలంగాణ కోర్టుకు కేసు బదిలీ అయిన తరువాత వేగం పుంజుకుందా? వైఎస్ షర్మిళ కీలక వ్యాఖ్యలు తరువాత పరిణామాలు మారిపోయాయా? అందులో భాగంగానే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ వరుస నోటీసులిచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, సీఎం జగన్ బాబాయ్ ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే హత్య జరిగి నాలుగేళ్లవుతున్నా విచారణలో ఎటువంటి పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసు విషయంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఎన్నెన్నో మాటలు అన్నారు. రాజకీయ లబ్ధికి వాడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఈ అంశం మరుగున పడిపోయింది. దీంతో వివేకానందరెడ్డి కుమార్తె సునీత అభ్యర్థనతో సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు కేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. అప్పటి నుంచి వేగం పుంజుకుంది.

ప్రధానంగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ సీబీఐ ఇంతవరకూ ఆయన్ను విచారించలేదు. అయితే ఈ నెల 23న తొలిసారిగా నోటీసులిచ్చింది. ఆ మరుసటి రోజే హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే తనకు ముందస్తుగా చాలా కార్యక్రమాలు ఫిక్సయ్యాయని.. కనీసం 5 రోజులు సమయం కావాలని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో గురువారం మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. 28 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఎన్నడూ లేనంతగా సీబీఐ వడివడిగా అడుగులేస్తుండడం గమనార్హం. అయితే అవినాష్ రెడ్డిని నిందితుడిగా పరిగణించి విచారణ చేపడతారా? లేకుంటే సాక్షిగా పిలిచారా అన్నది మాత్రం స్పష్టత లేదు. నోటీసులో పేర్కొన్న విషయాలు బయటపడడం లేదు.
ఎన్నికల ముందు వరకూ వివేకానందరెడ్డి హత్యకేసు చుట్టూ రాజకీయాలు తిరిగినా.. ఎన్నికల తరువాత వాస్తవాలు ఒక్కొక్కటీ బయటకు వచ్చాయి. కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వెల్లువెత్తాయి. రాజకీయ ఆధిపత్యం, ఆస్తి తగాదాలు వంటి వాటితో సొంత కుటుంబసభ్యులే హత్యచేశారని ప్రత్యర్థుల ఆరోపించారు. దానికి తగ్గట్టు సీబీఐ కూడా వారి పేర్లను చార్జిషీట్ లో దాఖలు చేయడంతో కేసు కొత్త మలుపు తిప్పింది. ఎన్నికల ముందు వరకూ జగన్ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసినా.. అధికారంలోకి వచ్చిన తరువాత అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే ఈ విషయంలో వివేకా కుమార్తె సునీత న్యాయపోరాటం చేశారు. సీబీఐ విచారణ కొనసాగేలా చూసుకున్నారు. అటు కేసును తెలంగాణ కోర్టుకు బదిలీ చేయించుకున్నారు. ఇదే సమయంలో జగన్ సోదరి షర్మిళ హత్య జరిగి నాలుగేళ్లు కావస్తోందని.. కేసులో కావాలనే జాప్యం జరిగిందని ఆరోపించిన తరువాత విచారణ వేగం పెంచుకోవడం విశేషం.

అయితే ఇన్నాళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. వివేకా హత్య కేసు గురించి మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. ముందురోజు నోటీసులిచ్చి.. తరువాత రోజు విచారణకు హాజరుకు రమ్మంటే ఎలా? న్యాయం గెలవాలి. నాలుగైదు రోజుల్లో సీబీఐ విచారణకు హాజరవుతా? నేనేంటో.. నా వ్యవహార శైలి ఎంటో జిల్లా ప్రజలకు తెలుసు. కేసులో నిజాలు వెల్లడి కావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. ఆరోపణలు చేసేవారు ఒక్కటి గుర్తించుకోవాలి. అంటూ వ్యాఖ్యానించారు. 28న ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిస్తున్నాయి. గతంలో ఎన్నడూ వివేకా హత్య కేసు గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో తప్పనిసరై మాట్లాడినట్టుందని విశ్లేషకులు భావిస్తున్నారు.