Governor Tamilisai- MLC Kaushik Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వాడే భాష.. ఎవరినీ గౌరవించని నైజం ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఒంటపట్టించుకున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ తనయుడు తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అమెరికాలో చదువుకున్న వ్యక్తిగా, విద్యావంతుడిగా, తెలివైన వ్యక్తిగా మొన్నటి వరకు తెలంగాణ ప్రజలకు కేటీఆర్‌పై గౌరవం ఉండేది. కానీ ఆరు నెలలుగా ఆయన మాట్లాడుతున్న తీరు, దుర్భాషలు, అహంకారం, అసహనం, పొగరుబోతు తనంతో తన ఇమేజ్‌ను తనే డ్యామేజ్ చేసుకుంటున్నారు. పెద్దరికం, హోదాతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కారణం తెలియదు కానీ, బీఆర్‌ఎస్ ప్రకటన తర్వాత ఈ అసహనం కేటీఆర్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా తమ నేతలను అనుసరిస్తున్నారు. భాషను, తిట్లను వారసత్వంగా స్వీకరిస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్సీ కౌషిక్‌రెడ్డి గవర్నర్ తమిళిసైపై చేసిన కావురం విమర్శలే నిదర్శనం.

మహిళ అనే గౌరవం లేకుండా..
భారత రాష్ట్రసమితిలో మహిళలకు ప్రాధాన్యం తక్కువ, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి నుంచి కిందిస్థాయి నేతల వరకు మహిళలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. మొదటి ప్రభుత్వాన్ని మహిళా మంత్రి లేకుండానే నిర్వహించడం ఇందుకు నిదర్శనం. మహిళ అంటే కేవలం కల్వకుంట్ల కవిత ఒక్కరే అనే భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. మిగతా మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు అంటే ఆ పార్టీ నేతలకు ఎప్పుడూ చులకన భావమే. అందేకే ఒక్క జిల్లాకు కూడా మహిళను పార్టీ అధ్యక్షురాలిని చేయలేదు. 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి కాబట్టి రాజ్యాంగ పదువులు ఇస్తున్నారు. కానీ, ఇక్కడ కూడా భర్తల పెత్తనమే కొనసాగుతోంది. ఇది అనేక సందర్భాల్లో బయటపడింది. ఏ మహిళా నేత అయినా స్వతంత్రంగా వ్యవహరించాలని చూస్తే ఆమెపై ఆరోపణలు చేయించడం, వేధించడం గులాబీ నేతలకు అలవాటుగా మారింది.
గవర్నర్‌పై అసభ్య పదజాలం..
ఇక గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చులకన భావంతోనే ఉంది. కేసీఆర్ కూడా మహిళా గవర్నర్‌కు గౌరవం ఇవ్వడం లేదు. ప్రొటోకాల్ పాటించడం లేదు. తన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో చిల్లరమల్లరగా వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఛాన్స్‌గా తీసుకున్న ఎమ్మెల్సీ పాడి కౌషిక్‌రెడ్డి గవర్నర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై ‘గవర్నర్ బిల్లులు తన ముడ్డికింద పెట్టుకుని ఏం చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. తాను రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి, రాష్ట్ర ప్రథమ పౌరురాలు, ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్, అదీ మహిళపై ఇలా అసభ్యంగా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌషిక్‌రెడ్డి వ్యాఖ్యలను అందరూ ఖండిస్తున్నారు.

నోరు మెదపని కవితక్క..
ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన మొదట్లో బీజేపీ మహిళా నేతలు కవిత ఇంటిముందు ఆందోళనకు యత్నిస్తే బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులంతా బీజేపీ తీరును ఖండించారు. పోలీసులతో దాడిచేయించి అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత కూడా తనపై నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని ఖండించారు. తర్వాత ఈడీ చార్జిషీట్‌లో పేరు ప్రస్తావించాక సైలెంట్ అయ్యారు. సీబీఐకి విరవణ కూడా ఇచ్చకున్నారు. మహిళలకు ప్రతినిధిని, తెలంగాణ బతుకమ్మకు తానే ప్రతీకను అని చెప్పుకునే కవిత.. కౌషిక్‌రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం నోరు మెదపడం లేదు. గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకల్లో ఫామ్‌హౌస్‌ల గురించి మాట్లాడగానే.. ట్విట్టర్‌లో స్పందించిన కవితకు అంతకుముందే తమ పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు వినపడకపోవడం, కనిపించకపోవడం గమనార్హం. కౌషిక్‌రెడ్డి అసభ్య వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలెవరూ ఖండించకపోవడం వారికి మహిళలపై ఉన్న గౌరవానికి నిదర్శనమన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది.
