Sambhaji Raje Meet CM KCR: తెలంగాణ పాలనను గాలికి వదిలేసి బీఆర్‌ఎస్ విస్తరణపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తెలంగాణ ప్రజలు కట్టే పన్నులతో పార్టీ సభలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని నేతలను బీఆర్‌ఎస్‌లోకి ఆకర్షించేందుకు తాయిలాలు, పదవులు ఆశ చూపుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మాటలతో ఛత్రపతి శివాజీ వారసుడిని కుడా బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ 13వ తరం వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె ప్రగతి భవన్‌లో ప్రత్యక్షం కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

నాందేడ్ సభ నేపథ్యంలో..
బీఆర్‌ఎస్ మొదటి సభ ఇటీవల ఖమ్మంలో నిర్వహించారు. ముగ్గురు సీఎంలను సభకు ఆహ్వానించి వజయవంతమైందని భావిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న మరో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు కేసీఆర్. ఈ క్రమంలో అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛత్రపతి శివాజీ వారసుడు ఛత్రపతి శంభాజీ రాజెతో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌కు వచ్చి ఆయనను భారత్ రాష్ట్ర సమితి నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత సహా కీలక నాయకులు మాట్లాడారు. సమకాలీన రాజకీయాలు, వివిధ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
మర్యాద పూర్వక భేటీ అంటూ రాజకీయాలపై చర్చ..
అయితే ఛత్రపతి శంభాజీ రాజె ప్రగతి భవన్‌కు రావడం, బీఆర్‌ఎస్ నేతలను కలవడం అంతా మర్యాద పూర్వక భేటీ మాత్రమే అని గులాబీ నేతలు చెబుతున్నారు. మహారాష్ట్రలోని నాందెడ్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రగతి భవన్‌కు వచ్చిన శంభాజీ రాజేకు కేసీఆర్ శాలువా కప్పారు. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. తెలంగాణ సాధించిన ప్రగతి, సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు విషయాల గురించి శంభాజీ రాజే ఈ సందర్భంగా ఆయనను అడిగి తెలుసుకున్నారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో సహా అన్నివర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు కావాల్సిన అవసరం ఉందని శంభాజీ రాజే అభిప్రాయపడ్డారని సమాచారం. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది. ప్రజల అభివృద్ధి, దేశ సమైక్యత కోసం వివిధ రాజకీయా పార్టీలు సరికొత్త అజెండాలతో ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందని శంభాజీ రాజే కోరినట్లు తెలుస్తోంది.

శివాజీ సేవలను గుర్తుచేసుకున్న కేసీఆర్..
ఇదే సమయంలో శంభాజీరాజే పూర్వీకులు ఛత్రపతి శివాజీ మహరాజ్ నుంచి సాహు మహరాజ్ వరకు దేశానికి చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారి పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని కేసీఆర్‌కు బహూకరించారు. మొత్తానికి మరాఠ్వాడాలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో శివాజీ వారసుడిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని బీజేపీకి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మరోవైపు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న మహారాష్ట్రలోని వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఫిబ్రవరి 5న జరిగే సభలో బీఆర్‌ఎస్‌లో ఎంతమంది చేరుతారు.. అందులో కీలక నేతలు ఎంతమంది అన్న ఆసక్తి నెలకొంది.