Viral News: మనలో చాలామందికి కొన్ని విషయాలపై విపరీతమైన బద్ధకం ఉంటుంది. ఉదయం లేవాలంటే బద్ధకం.. వాకింగ్ చేయాలంటే బద్ధకం.. ఇల్లు, ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలంటే బద్ధకం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బద్దకాలున్నాయి. అయితే ఈ బద్ధకాన్ని మన శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపించే విషయంలో కొనసాగిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
ఇప్పుడు మనం తినే తిండి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో తినడం తగ్గిపోయింది. బయట తినడం పెరిగిపోయింది. తిన తిండి బలవర్ధకమైనది కాదు. మాంసకృతులు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఉన్న వాటిని తినడం పూర్తిగా మానేశాం. నాలుకకు రుచిగా ఉంటే చాలు అనుకునే స్థాయికి వచ్చేసాం. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ లు, నూడిల్స్, బ్రెడ్ ఆమ్లెట్, పాస్తా, పిజ్జా, బర్గర్ మాత్రమే పోషక పదార్థాలు అని ఫిక్స్ అయిపోయాం. కానీ అవన్నీ ఆకలి మాత్రమే తీర్చుతాయి… శరీరానికి ఏమాత్రం పోషణ అందివ్వవు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ముఖ్యంగా ఆహారంలో పీచు పదార్థాన్ని కోల్పోవడం వల్ల ఏం నష్టపోతున్నామో గుర్తించలేకపోతున్నాం. అయితే ఇదే విషయాన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు వినూత్నంగా చెప్పారు. వారు ఏర్పాటు చేసింది మామూలు హోర్డింగే అయినప్పటికీ.. అందులో చాలా లోతు ఉంది. తెలుసుకోవాల్సిన నీతి ఉంది.. విస్మరిస్తున్న రీతి ఉంది.
చెత్తను చూసుకుంటున్నారా..
ఎవరైనా ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో చెత్తను బయటపడేస్తున్నారా.. మీ ఇల్లును శుభ్రం చేసుకుంటున్నారా.. అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. ఇది కూడా ఓ ప్రశ్నేనా అనిపిస్తుంది.. రోజు చేస్తున్నది అదే కదా అనే సమాధానం మీ నోటి నుంచి వస్తుంది. ఇక ఇదే ప్రశ్నను మీ శరీరానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? జీవన క్రియల్లో భాగంగా శక్తి ఏర్పడుతుంది. అదే సమయంలో వ్యర్ధాలు కూడా ఏర్పడతాయి. ఆ వ్యర్ధాలను శరీరం సరైన సమయంలో బయటికి విడుదల చేయకపోతే అనర్ధాలు ఏర్పడతాయి. ఇప్పుడు నూటికి పావు వంతు శాతం మందిలో వ్యర్ధాలు సరైన సమయంలో బయటికి వెళ్లడం లేదు. దీనివల్ల వారు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.. ఆహారం జీర్ణమైన తర్వాత వ్యర్ధాలు బయటికి వెళ్లకపోవడం వల్ల నరకం చూస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం హైదరాబాదు నగరంలో “అస్సానా” అనే పేరుతో ఒక హాస్పిటల్ ఏర్పాటయింది. ఇది చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఈ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా వివరించడానికి ఒక హోర్డింగ్ ఏర్పాటు చేసింది. అందులో పేర్కొన్న ఒక అంశం ఆసక్తిని కలిగిస్తోంది. ఆలోచింపజేస్తోంది..”దైనందిన జీవితంలో మన శరీరం నుంచి చెత్తను బయటకు పంపించడం ఓ నిత్య కృత్యం. అలాంటిది మీ శరీరం నుంచి జరగడం లేదా.. అయితే మమ్మల్ని సంప్రదించండి” అని ఆ హోర్డింగ్ లో ఆ ఆసుపత్రి నిర్వాహకులు పేర్కొన్నారు. ఇది చూడ్డానికి ఎంతో ఆలోచింపజేస్తోంది. అంతేకాదు మనిషి తన శరీరం నుంచి వ్యర్థాలను బయటికి పంపించకపోతే ఎంతటి అనర్ధాలు జరుగుతాయో వివరిస్తోంది. అందుకే పది వాక్యాలు చెప్పలేని విషయాన్ని ఒక ఫోటో చెబుతుంది. 10 ఫోటోలు చెప్పలేని విషయాన్ని ఒక హోర్డింగ్ వివరిస్తుంది. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే.