Chandrababu: బై బై బాబు. బాబు నిన్ను నమ్మం. బాబు పోవాలి జాబు రావాలి. ఇవీ 2019 ఎన్నికల్లో వైసీపీ నినాదాలు. వైసీపీ అన్నట్టుగానే ఏపీ జనం బాబుకు బై బై చెప్పారు. జగన్ కు వెల్ కం చెప్పారు. అద్భుతమైన మెజార్టీ కట్టబెట్టారు. కానీ జగన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా ? చంద్రబాబే నయం అనిపించుకుంటున్నారా ? బై బై బాబు అనడం ఏపీ ప్రజల చారిత్రక తప్పిదమా ?.

బై బై బాబు అనే నినాదాన్ని ఏపీ ప్రజల్లోకి వైసీపీ బలంగా తీసుకుపోయింది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బాగా క్యాష్ చేసుకుంది. వైసీపీ మొత్తం ప్రచారంలో బై బై బాబు క్యాంపెయిన్ బాగా సక్సెస్ అయింది. ఫలితంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇదే నినాదం ఏపీ ప్రజల కొంపముంచిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం నాలుగేళ్ల జగన్ పాలనే. అప్పులు తీసుకురావడం.. పప్పు బెల్లంలా పంచి పెట్టడం. ఇదే ఏపీలో సంక్షేమం పేరిట జరుగుతున్న తతంగం. జగన్ పాలనా తీరు ఏపీ ప్రజలకు తీరని నష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షేమం తప్పు కాదు. అదే సమయంలో అభివృద్ధీ జరగాలి. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లలా ఉండాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది.
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు, లోకేష్ తీవ్రంగా కృషి చేశారు. పెట్టుబడిదారులతో మంచి సంబంధాలను పెట్టుకున్నారు. ఫలితంగా కొన్ని సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా ఉపాధి దొరికింది. అందుకు ఉదాహరణ పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమే. అలాంటి పరిశ్రమ జగన్ పాలనలో ఒక్కటీ ఏపికి రాలేదనే చెప్పాలి. పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామిక అభివృద్ధి పై ఫోకస్ చేయడంలో ఏపీ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యంతో ఉందని చెప్పుకోవచ్చు.

పొరుగు రాష్ట్రం తెలంగాణ పెట్టుబడులు ఆహ్వానించడానికి కాలికి బలపం కట్టుకొని తిరుగుతోంది. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించింది. మైక్రో సాఫ్ట్ నుంచి 18,000 కోట్లు, అమెజాన్ వెబ్ సర్వీస్ నుంచి 35, 000 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయి. కానీ ఏపీ మంత్రి దోవోస్ వైపు కన్నెత్తి చూడలేదు. అసలు దావోస్ సదస్సు నుంచి ఏపీకి ఆహ్వానమే రాలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆహ్వానం వచ్చింది కానీ వెళ్లలేదని ఏపీ మంత్రి అమర్నాథ్ తీరికగా సమాధానం చెప్పారు. ఇంత కంటే నిర్లక్ష్య వైఖరి ఇంకేం ఉంటుంది. ప్రభుత్వానికి అభివృద్ధి పై ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఈ ఒక్క ఉదాహరణ తేటతెల్లం చేస్తోంది. బాబుకు బైబై చెప్పి .. జగన్ కి వెల్ కం చెప్పి ఏపీ ప్రజలు చారిత్రక తప్పిదం చేశారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.