Buy Happiness: సంతోషాన్ని కొనుక్కోవచ్చు… అదీ చౌకగా !

పేదరికం, ఒంటరి తనం, కుటుంబ కష్టాలు, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో నష్టాలు.. అనారోగ్య సమస్యలు ఇలా కారణం ఏదైనా కావొచ్చు మనిషి మానసిక ఒత్తిడికి గురై సంతోషానికి దూరమవుతాడు.

Written By: Raj Shekar, Updated On : August 31, 2023 2:08 pm

Buy Happiness

Follow us on

Buy Happiness: కో అంటే… కోటి… దొర్లుకుంటు వస్తుంది కొండమీది కోతి… పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మయినా.. ఇది ఓ సినిమాలోని పాట. డబ్బుంటే ఏ సమస్యలు ఉండవని, ఏదైనా మన చెంతకు నడుచుకుంటూ వస్తుందని అని అర్థం… అయితే.. డబ్బుతో దేన్నయినా కొనచ్చు కానీ, సంతోషాన్ని మాత్రం కొనలేమని అదే సినిమాల్లో డైలాగులు చెబుతున్నారు. అయితే అది తప్పని పరిశోధన తేల్చింది. కేంబ్రిడ్జ్‌ బిజినెస్‌ స్కూల్, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలు ఓ బ్యాంకుతో కలిసి చేసిన ఓ సర్వేలో కూడా సంతోషాన్ని కొనుక్కోవచ్చని తేచ్చారు. ఆ సర్వే కోసం 625 మంది ఖాతాదారులను కేంబ్రిడ్జ్‌ బిజినెస్‌ స్కూల్, యూనివర్సిటీ, బ్యాంకు ఎంచుకున్నాయి. వారు 6 నెలలపాటు జరిపిన 76 వేల లావాదేవీలను పరిశీలించగా డబ్బుతో సంతోషం కొనుక్కోవచ్చని వెల్లడైంది. ఈ 76 వేల లావాదేవీలను నిపుణులు 112 రకాలుగా వర్గీకరించారు. వాటిని 59 రకాలుగా వడపోసి, వాటిని విశ్లేషించారు. తమ వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులు కొనుగోలు చేసిన వారు సంతోషంగా ఉన్నట్టు వారు కనుగొన్నారు. ధనం, సంతోషం మధ్య సన్నని గీత ఉందని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించగా, అది తప్పని తాము కనుగొన్నామని కేంబ్రిడ్జ్‌ సంస్థ వెల్లడించింది. వ్యక్తిత్వానికి సరిపడా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఆనందంగా ఉన్నట్టు తాము గుర్తించామని వారు తెలిపారు.

ఇప్పుడు నైజీరియన్‌ కూడా…
తాజాగా ఓ నైజీరియన్‌ కూడా డబ్బుతో సంతోషం కొనుక్కోవచ్చంటున్నాడు. ఇందుకోసం మూడేళ్ల క్రితం సంతోషాన్ని విక్రయించే కేంద్రం కూడా ఏర్పాటు చేశాడు. 2 డాలర్ల కంటే తక్కువకే ఇక్కడ సంతోషాన్ని విక్రయిస్తున్నాడు. దీంతో మూడేళ్లలోనే అతడి సంతోషం అమ్మక కేంద్రం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయింది.

హ్యాపీ వైబ్‌ సెంటర్‌..
పేదరికం, ఒంటరి తనం, కుటుంబ కష్టాలు, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో నష్టాలు.. అనారోగ్య సమస్యలు ఇలా కారణం ఏదైనా కావొచ్చు మనిషి మానసిక ఒత్తిడికి గురై సంతోషానికి దూరమవుతాడు. చాలా మంది ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్, గుండెపోటు, పెరాలసిన్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పని ఒత్తిడితో చాలా మంది సంతోషానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో సంతోషం కావాలనుకునే వారి కోసం నైజిరియాలో మూడేళ్ల క్రితం అంటే కోవిడ్‌ సమయంలో హ్యాపీ వైబ్‌ పేరుతో ఓ కేంద్రం ఏర్పాటు చేశారు నైజీరియన్‌ చుక్‌వుమా ఎజే.

మూడేళ్లలో 30 వేల కాల్స్‌..
సంతోషం దూరమైన వారి కోసం ఈ హ్యపీ వైబ్‌ కేంద్రంలో టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. దానికి మూడేళ్లలో 30 వేల కాల్స్‌ వచ్చాయట. ఏడుస్తూ, బాధతో, కష్టాల్లో ఉన్నామని మానసిక ఒత్తిడితో.. కుటుంబంలో గ్యాప్‌ వచ్చిందనే బాధతో కాల్స్‌ వస్తున్నాయని యజమాని చుక్‌వుమా ఎజే వెల్లడించారు. బాధతో ఫోన్‌ చేసినవారు ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషంగా ఇళ్లకు వెళ్తున్నారని అంటున్నారు. అందుకే ఏటా ఇక్కడి వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు.

ఏం చేస్తారంటే..
బాధతో హ్యాబీ వైబ్స్‌ కేంద్రానికి వచ్చే ప్రతీ కాల్‌ను అక్కడి సిబ్బంది రికార్డు చేస్తారు. సమస్యను తెలుసుకుంటారు. కాల్‌ చేసినవారికి ప్రత్యేక తేదీ ఇస్తారు. అప్పటి వరకు అతని బాధ ఆధారంగా అవసరమైన మోటివేషన్, రిలేషన్‌ బాండ్, ప్రేమించే వారితో మాట్లాడి హిస్టరీ రికార్డు తయారు చేస్తారు. ఇచ్చిన తేదీకి వారు సెంటర్‌కు రాగానే సమస్యకు పరిష్కారం చూపుతారు. ఇందు కోసం ఈ సెంటర్‌లో 50 మంది పనిచేస్తున్నారు. మ్యారేజ్, లవ్‌ బ్రేకప్, హెల్త్, డిప్రెషన్, మెంటల్‌ ప్రెజర్‌ ఇలా అనేక సమస్యలకు వీరు పరిష్కారం చూపుతున్నారు. సెలబ్రేషన్స్‌ చేస్తారు. బాధలో ఉన్నవారికి ఇష్టమైన వారిని పిలిపించి అనుబంధాలు పెంచుతారు. ఇలా అనేక విధాలుగా సమస్యకు పరిష్కారం చూపుతున్నారు.

15 భాషల్లో ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌..
ఏటా బాధితులు పెరుగుతుండడం, ఇతర దేశాల నుంచి కూడా ఫోన్‌ కాల్స్‌ వస్తుండడంతో హ్యాపీ వైబ్‌ కంపెనీ వారు 15 భాషల్లో ప్రత్యేకంగా కాల్స్‌ రిసీవ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇక ఇంత చేస్తున్నారు కదా ఎక్కువ డబ్బులు తీసుకుంటారేమో అనుకుంటే.. దీనికి వీరు వసూలు చేసేది గంటకు కేవలం 2 డాలర్లకన్నా తక్కువే.

యూనిసెష్‌ నివేదిక ఇలా..
యూనిసెఫ్‌ నివేదిక ప్రకారం 2024 నాటికి ప్రతీ ఆరుగురు నైజీరియన్లలో ఒకరు మానసిక ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలతో బాధపడతారని తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన చుక్‌వుమా ఎజే ఈ హ్యాపీ వైబ్‌ సెంటర్‌ ప్రారంభించారు. సమస్య పరిష్కారమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించాడు.