Homeట్రెండింగ్ న్యూస్Congress vs BRS : బురద చల్లడం అంటే ఒక ఆర్ట్.. కేసీఆర్ ను ఏదో...

Congress vs BRS : బురద చల్లడం అంటే ఒక ఆర్ట్.. కేసీఆర్ ను ఏదో చేయాలనుకుని.. చివరికి కాంగ్రెస్సే బాధిత పక్షమైపోయింది..

Congress vs BRS : తమ ప్రజా పరిపాలన ఘనతపై.. తాము అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందన తెలుసుకోవడానికి కాంగ్రెస్ పోల్ నిర్వహించింది. ఇది ఇంత వరకే పరిమితమైతే బాగుండేది. కానీ కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ను గెలుక్కుంది. ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా? ప్రజా పరిపాలన బాగుందా? అని రెండు ప్రశ్నలు సంధించింది. అందులో ఫామ్ హౌస్ పరిపాలన బాగుంది అనే దానికి 70+ ఓట్లు వచ్చాయి. ఇంకేముంది గులాబీ సోషల్ మీడియా విభాగం రెచ్చిపోయింది.. చూశారా.. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. ఇప్పటికైనా సోయి లోకి వచ్చి మాట్లాడండి.. తెలంగాణ ప్రజలు ఏ పరిపాలనకు జై కొట్టారో చూశారు కదా.. అన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టింది. తనకున్న అన్ని సోషల్ మీడియా గ్రూపులలో కాంగ్రెస్ పార్టీఫై ఎంతవరకు బురద చల్లాలో అంతవరకు చల్లేసింది.. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా నాలుక కరుచుకున్న కాంగ్రెస్ పార్టీకి కాస్త విలువలు గుర్తొచ్చినట్టు ఉన్నాయి. తర్వాత కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. వాస్తవానికి ఆ పోల్ నిజమా? అబద్ధమా? అని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ చూస్తే.. అది నిజమే అనిపించింది. కానీ ఇలాంటి పోల్ ఈ సమయంలో చేయడం ఎందుకు? దీనివల్ల జరిగిన లాభం ఏంటో? ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలియదు కావచ్చు.. కానీ ఇక్కడే కాంగ్రెస్ నాయకులు గులాబీ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని తక్కువగా అంచనా వేశారు. అది ఎలా ఉంటుందంటే.. ఎలాంటి పనులు చేస్తుందంటే.. బురద చల్లడంలో ఎంతటి ఘన కీర్తి సాధించిందంటే.. దాని బాధితులకు మాత్రమే తెలుసు. కాంగ్రెస్ పార్టీ పోల్ ను ఏకంగా హైజాక్ చేసి పడేసింది. ఈ పోల్ లో ఒకానొక దశలో భారత రాష్ట్ర సమితికి 73.5%, కాంగ్రెస్ పార్టీకి 26.5% ఓట్లు వచ్చాయి. ఇంకేముంది వీటిని స్క్రీన్ షాట్ తీసి కాంగ్రెస్ పార్టీని గులాబీ సోషల్ మీడియా వింగ్ ఒక ఆట ఆడుకుంది. మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. గులాబీ సోషల్ మీడియా అనేదే పరమ దారుణంగా ఉంటుందని.. గాలి పోగేసి.. చెత్తను జత చేర్చి అది మీదికి వదిలేసే బ్యాచ్ అని..

కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినప్పటికీ..

ఇంత జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీర ఆలస్యంగా మేల్కొంది. అసలు ఆ పార్టీకి మీడియా సెల్, సోషల్ మీడియా సెల్ ఉన్నాయో.. వాటిని డీల్ చేస్తున్నవారు ఏం చేస్తున్నారో ఇప్పటికీ తెలియదు. చివరికి భారత రాష్ట్ర సమితి సోషల్ దాడి నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు సాధారణ నెటిజన్లే ఏదో ఒక రూపంలో కౌంటర్ ఇస్తున్నారు. చివరికి తనపై జరుగుతున్న దాడి నుంచి కాపాడుకోలేని దురావస్థ కాంగ్రెస్ పార్టీది.. ముఖ్యమంత్రి మీడియా సెల్ ది.. మరి అంతటి సునీల్ కనుగోలు మహాశయుడు ఏం చేస్తున్నాడు? ఆయన టీం మొత్తం ఏం చేస్తోంది? ప్రజల్లోకి ఇంత వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తుంటే.. దానికి కౌంటర్లు ఎందుకు ఇవ్వలేకపోతోంది? అనే ప్రశ్నలకు ఎవరి వద్దా సమాధానాలు లేదు. అన్నట్టు ఈ పోల్ ను హైజాక్ చేశారట.. సో కాల్డ్ వ్యక్తులు పోల్ లో పాల్గొన్నారట.. హబ్బా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ఇప్పటికి సోయి వచ్చింది. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది..పాపం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ.. ఇంత బేలతనాన్ని ఎందుకు చూపిస్తుందో ఒక పట్టాన అర్థం కావడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular