
ఒక దేశానికి మరో దేశానికి చాలా విషయాల్లో అనేక మార్పులు ఉంటాయి. ఆహారపు అలవాట్లలో, పిల్లల పెంపకంలో ప్రధానంగా ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఆలోచన తీరు మారుతుంది. తాజాగా అమెరికాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఇరుగుపొరుగు వారికి తమ పిల్లవాడు ఇబ్బంది కలిగించాడనే కారణంతో తల్లిదండ్రులు బాలుడికి విచిత్రమైన శిక్షను విధించారు. బాలుడు రోడ్డు పక్కనే నివాసం ఉండాలని ఇంటికి రాకూడదనే శిక్ష విధించారు.

పూర్తి వివరాలలోకి వెళితే అమెరికాలోని ఆరిజోనాలోని ఫోనిక్స్ కు చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడైన ఏంజెల్ మార్టినెజ్ ను ఇంట్లోనే వదిలి తమ పెళ్లిరోజు సందర్భంగా లాస్ వెగాస్ కు వెళ్లారు. ఆ సమయంలో మార్టినెజ్ కారుతో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేసి ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించాడు. ఇరుగు పొరుగు వారు చివరకు సహనం కొల్పోయి బాలుడి విన్యాసాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలిసిన మార్టినెజ్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయితే కొడుకుపై ఉన్న ప్రేమ వల్ల స్టేషన్ నుంచి విడిపించుకుని వచ్చిన తల్లిదండ్రులు బాలుడిని రోడ్డు పక్కనే ఉండాలని ఆదేశించడంతో పాటు అతని బెడ్, టీవీ, టేబుల్ అన్నీ రోడ్డు పక్కన పెట్టారు. అక్కడ బాలుడు ” నా తల్లిదండ్రుల కారును వారి అనుమతి లేకుండా తీసుకుని ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించానని… నన్ను క్షమించాలి” అని బోర్డు పెట్టాడు. బాలుడు మీడియాతో కారును నీటితో శుభ్రం చేసి అక్కడికక్కడే గుండ్రంగా తిప్పానని నీరు డ్రై అవుతుందనే ఉద్దేశంతో అలా చేశానని చెబుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు మాత్రం చేసిన తప్పు అర్థం కావాలనే ఈ శిక్ష విధించామని చెబుతున్నారు.