Kisi Ka Bhai Kisi Ki Jaan
Bollywood- South Indian Culture: దక్షిణ భారత సంస్కృతిని బాలీవుడ్ చెడగొడుతోందా..? ఇక్కడ సాంప్రదాయాలను లెక్కచేయకుండా బాలీవుడ్ తారలు వ్యవహరిస్తున్నారా అంటే..? అవునన్న సమాధానమే ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖుల నుంచి వినిపిస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ఓ చిత్రంలో నుంచి విడుదల చేసిన పాటలో దక్షిణ భారతదేశ సంస్కృతిని చెడగొట్టే రీతిలో వస్త్రధారణ ఉందంటూ ప్రముఖ క్రికెటర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ పాటలో ఏముంది..?
బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్, వెంకటేష్ హీరోలుగా రూపొందించిన.. కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఇటీవల ఈ చిత్రంలో నుంచి ఏంటమ్మా అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన డ్యాన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లుంగీ డాన్స్ తరహాలో ముగ్గురు స్టార్ హీరోలు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వీడియో ట్రెండ్ అయింది. వేలాదిగా వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా ఈ పాట పై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అసభ్యకరంగా డాన్స్ చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ట్విట్ చేశారు.
ట్వీట్ లో శివరామకృష్ణన్ ఏమి రాసారంటే..?
దక్షిణ భారతదేశ సంస్కృతిని కించపరిచేలా ఈ పాట ఉందంటూ ఆయన ఆరోపణలు చేశారు. వెంటనే ఈ సాంగ్ ను బ్యాన్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ను ట్యాగ్ చేస్తూ ఆయన ట్విట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది చాలా హాస్యాస్పదమని, ఈ పాటకు హీరోలు ధరించింది లుంగీ కాదని, దోతిని లుంగీగా చూపించారని విమర్శలు గుప్పించారు. ఇది దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాసిక్ దుస్తులను చాలా అసహ్యకరమైన రీతిలో చూపించారంటూ ఆవేదన చెందారు. ఈ రోజుల్లో డబ్బు కోసం ఏ పనైనా చేస్తారని, లుంగీ, దోతికి తేడా ఏంటో కూడా కనీసం తెలుసుకోరంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆలయంలో బూట్లు ధరించి ఎలా డాన్స్ చేస్తారని ప్రశ్నించారు. తాజాగా ఆయన ట్వీట్ పై విభిన్నమైన రీతిలో స్పందనలు వస్తున్నాయి. ఆయనను ఎక్కువమంది సమర్థిస్తుండగా.. మరి కొంతమంది పాటను పాటలా చూడాలంటూ ఆయనకు సూక్తులు చెబుతున్నారు.
ఏప్రిల్ 21న విడుదల కానున్న సినిమా..
రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, వెంకటేష్.. కలిసి ఉన్న పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జోడిగా తెరకెక్కుతున్న.. ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. ఫరహాద్ సామిజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుపాటి, భూమిక చావ్లా, షహనాజ్ గిల్, రాఘవ్ జుయాల్, సిద్ధార్థ్ నిగమ్, పాలక్ తివారి, జాస్సీ గిల్.. కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనన్నట్లు చిత్ర బంధం వెల్లడించింది.
Kisi Ka Bhai Kisi Ki Jaan
ఎన్నో అంచనాల మధ్య వస్తున్న సినిమా..
ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సల్మాన్ ఖాన్ ఈ చిత్రం ద్వారా తన స్టామినాను బాక్సాఫీస్ కు రుచి చూపించాలనుకుంటున్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ కు.. ఇది మంచి విజయాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.