KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి.. హైదరాబాదులోని నంది నగర్ ప్రాంతంలో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. ఇటీవల కేసీఆర్ ఈ ఇంటికి మారినప్పటి నుంచి ఆ స్థలంలో కార్లు, ఇతర వాహనాలు పార్క్ చేస్తున్నారు. కేసీఆర్ ను కలవడానికి వచ్చిన వీవీఐపీల వాహనాలను అక్కడ పార్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన కాన్వాయ్ లోని కొన్ని వాహనాలను అక్కడే పార్క్ చేసినట్టు సమాచారం. అయితే ఆ ఖాళీ స్థలం ఓ బడా వ్యాపారవేత్తకు చెందిందని తెలుస్తోంది. ఆ ఖాళీ స్థలంలో ఎర్రని వస్త్రాలు, ఒక బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలు ఉండడం .. చూడ్డానికి ఆ దృశ్యం భయానకంగా కనిపిస్తోంది. అర్ధరాత్రి పూట ఆ స్థలంలో ఎవరో క్షుద్ర పూజలు చేసినట్టు అక్కడి స్థానికులు అనుమానిస్తున్నారు.
కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపుతోంది.. ఎవరిని లక్ష్యంగా చేసుకునేందుకు ఈ పూజలు నిర్వహించారు? దీని వెనక ఎవరైనా ఉన్నారా? రాజకీయ దురుద్దేశం తోనే ఇలాంటి పనులకు పాల్పడ్డారా? వంటి విషయాలపై తెలంగాణలో జోరుగా చర్చ నడుస్తోంది. సాక్షాత్తు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి ఇంటి పక్కన అలాంటి క్షుద్ర పూజలు జరగడం భయాందోళనకు కారణమవుతోంది. కెసిఆర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి పనులు చేపట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్షుద్ర పూజలపై భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కెసిఆర్ కొన్ని అంశాలను బలంగా నమ్ముతుంటారు. వాస్తును విశ్వసిస్తుంటారు. యాగాలు చేపడుతుంటారు. వైదిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అందువల్లే ఆయనను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు ఇలాంటి వాటికి ఎవరైనా తెర లేపారా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. అయితే ఈ క్షుద్ర పూజలపై కేసీఆర్ కుటుంబం ఇంతవరకూ స్పందించలేదు . కానీ భారత రాష్ట్ర సమితికి చెందిన వాట్సాప్ గ్రూప్ లలో అయితే జోరుగా చర్చ జరుగుతోంది.
ఇక నంది నగర్ ప్రాంతం లో వీవీఐపీలు ఎక్కువగా ఉంటారు. సీసీ కెమెరాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాంటప్పుడు కేసీఆర్ ఇంటి పక్కల ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాల పుటేజి పరిశీలిస్తే నిందితులు ఎవరనేది తేలుతుందని స్థానికులు అంటున్నారు..” ఆ ఖాళీ స్థలంలో వాతావరణం చూస్తేనే భయంగా ఉంది. పైగా అక్కడ సినిమాల్లో మాదిరి క్షుద్ర పూజలు జరిగినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ సైన్స్ కాలంలోనూ అటువంటి వాటిని నమ్ముతారా? అని చాలామంది అనుకోవచ్చు. కానీ అక్కడ వాతావరణం చూస్తే ఎవరైనా భయపడతారు. ఇలాంటి వాటిని జరగకుండా చూడాలి. ఎందుకంటే చిన్న పిల్లలు వాటిని చూస్తే భయపడతారు. పెద్దవాళ్లు కూడా వణికి పోతారు” అంటూ అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.