Nagarjuna- Srihan: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్లే సింగర్ రేవంత్ టైటిల్ అందుకున్నారు. రేవంత్ ప్రవర్తన పరంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే గేమ్ విషయంలో అతడు పోరాట పటిమ చూపించేవాడు. ప్రతి టాస్క్ లో విన్నర్ తానే కావాలనే తాపత్రయం కనిపించేది. అందుకు వంద శాతం ఎఫ్ఫార్ట్స్ పెట్టేవాడు. ఈ క్రమంలో అతడి కోపం హద్దులు దాటేది. తోటి కంటెస్టెంట్స్ ని తిట్టడం, దెబ్బతలు తగిలేలా గేమ్ ఆడటం చేసేవాడు. ఇది రేవంత్ పై వ్యతిరేకతకు కారణమైంది. అతనిలో నెగటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ… సరైన పోటీ లేకపోవడం, ఎప్పటి నుండో ఉన్న ఫ్యాన్ బేస్ విన్నర్ ని చేసింది.

ఈ సీజన్లో కొంచెం ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ ముందుగానే ఎలిమినేట్ అయ్యారు. ఇండియన్ ఐడల్ విన్నర్ , స్టార్ సింగర్ అయిన రేవంత్ అంత పాపులారిటీ ఇంకెవరికీ లేదు. అతనికి ఎప్పటి నుండో ఉన్న అభిమాన వర్గం మద్దతుగా నిలిచారు. ఈ కారణాలతో రేవంత్ ఫైనల్ కి చేరాడు. చివరి నిమిషం వరకు విన్నర్ రేవంత్ అని అందరూ నమ్మారు. రేవంత్, శ్రీహాన్ లతో జర్నీ చేసిన కంటెస్టెంట్స్ కూడా అదే అభిప్రాయం వెల్లడించారు.
ఐతే ఫైనల్ రిజల్ట్ అందరి అంచనాలు తప్పని తేల్చింది. ప్రేక్షకులు రేవంత్ కాదు శ్రీహాన్ విన్నర్ కావాలని కోరుకున్నట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు . చాలా తక్కువ మార్జిన్ తో రేవంత్ పై శ్రీహాన్ ఓట్లలో పై చేయి సాధించాడని వెల్లడించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కూడా నాగార్జున చెప్పిన చేదు నిజం మైండ్ బ్లాక్ చేసింది. కేవలం రూ. 40 లక్షలకు ఆశపడి టైటిల్, ప్రైజ్ మనీ మొత్తంగా దక్కించుకునే సువర్ణావకాశాన్ని శ్రీహాన్ కోల్పోయాడు. రేవంత్ ని విన్నర్ ని చేయకపోతే పెద్ద మొత్తంలో నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన బిగ్ బాస్ టీమ్ తెలివిగా శ్రీహాన్ ని ఇరికించారని తెలుస్తుంది.

ఇప్పటికే ఎలిమినేషన్స్ ఫేక్ అంటూ ప్రచారం జరుగుతుంది. అలాగే అనేక కోణాల్లో షో విమర్శల పాలవుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ కంటే శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయంటే ఎవరూ నమ్మరు. శ్రీహాన్ ని విన్నర్ గా ప్రకటిస్తే పెద్ద ఎత్తున విమర్శలు రావచ్చు. దీంతో శ్రీహాన్ ని టెంప్ట్ చేసి విన్నర్ పొజీషన్ రేవంత్ కి కట్టబెట్టాలని ప్లాన్ చేశారు. అందుకే ప్రైజ్ మనీకి సమానమైన రూ. 40 లక్షలు ఆఫర్ చేశారు. సాధారణంగా రూ. 25 లక్షలు ఆఫర్ చేయడమే ఎక్కువ. మొత్తంగా తమపై ఎలాంటి నెగిటివిటీ రాకుండా శ్రీహాన్ ని ట్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.