
Miss Shetty Mr Polishetty: అనుష్క ని చూస్తే ఏమనిపిస్తుంది.. పుత్తడిబొమ్మలాగా ఉందనిపిస్తుంది. పువ్వుల కొమ్మలాగా ఆకర్షిస్తుంది. ఆరడుగుల అందం, దానికి తగ్గట్టు అభినయం.. చూపు తిప్పుకొనివ్వని మేని ఛాయ ఆమె సొంతం. అలాంటి అనుష్క శెట్టిని ఎలాంటి ప్రేమ కదిలించలేదు. ఏ పురుష పుంగవుడు ఆకర్షించలేదు. అందుకే పెళ్లంటే నో నో అంటున్నది. ఈ పద్ధతులన్నీ పాడు అంటోంది. సత్తె కాలపు సూక్తులు నావల్ల కాదని తెగేసి చెబుతోంది..హై పై, వై పై కాలంలో “వైపై” ఉండలేను అని చెబుతోంది.
ఇదంతా నిజ జీవితంలో కాదు. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు గానీ.. మూడు పదులు దాటినా అనుష్క శెట్టి ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటుందో లేదో కూడా తెలియదు. సరే ఆమె రియల్ లైఫ్ పక్కన పెడితే.. రీల్ లైఫ్ లో ప్రస్తుతం ఆమె మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి అనుష్కకు జంటగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షిస్తోంది. చాలాకాలం తర్వాత అనుష్క, దాదాపు రెండు సంవత్సరాల తర్వాత నవీన్ పొలిశెట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నేపథ్యంలో బజ్ ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో అనుష్క పెళ్లంటే ఇష్టం లేని యువతీ పాత్రలో కనిపిస్తోంది. దీనికి బలమైన నేపథ్యమే ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆమె ప్రేమ కోసం తాపత్రయపడే వ్యక్తిగా నవీన్ పాత్ర ఉంటుందని సమాచారం.. అమెరికా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఓవైపు హైదరాబాద్, మరో వైపు అమెరికా బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తున్నాయి.

ఉగాది సందర్భంగా ఈ చిత్ర యూనిట్ నో నో అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనిని ఎంఎం మానసి పాడారు. ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. రథన్ సంగీతం సమకూర్చారు.. ఈ పాటలో అనుష్కకు అసలు పెళ్లంటే ఇష్టం లేదని, పెద్దల మాటను ఏమాత్రం పట్టించుకోవడంలేదని అందులో ఉన్న పల్లవి, చరణాల ఆధారంగా తెలుస్తోంది.. పెద్దలు పెళ్లి చేసుకోమంటే, బాబాయ్ నాకు అసలు వద్దని వారిస్తున్న మహిళగా అనుష్క కనిపిస్తోంది.. ఈ చిత్రానికి పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఉగాది సందర్భంగా విడుదలైన తొలి లిరికల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.