NTR- Bharat Ratna Award: ఆయన తెలుగు జాతి కీర్తి పతాకం. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన సేవలు అసమాన్యం. కళామతల్లి ముద్దు బిడ్డగా, పాలనాదక్షుడిగా వేనోళ్ల కీర్తించబడిన ఘనత ఆయనది. తెలుగు జాతికి చేసిన సేవలకు ఏ రత్నమిచ్చినా తక్కువే. ఆ మహోన్నత వ్యక్తి ఎవరో కాదు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ చర్య ప్రశంసించదగ్గదే. కానీ రాజకీయ కోణం ఉండటం ఆహ్వానించదగ్గది కాదు.

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడే బీజేపీకి గుర్తొచ్చింది. పైగా దీనికి అటల్ బీహారీ వాజ్ పేయి కలగా కలరింగ్ ఇస్తోంది బీజేపీ. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే బీజేపీ ఆలోచన వెనుక రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది. ఇన్నాళ్లూ మిత్రుడిగా ఉన్న పవన్ టీడీపీతో జత కట్టే ఆలోచనలో ఉండటం బీజేపీకి రుచించడం లేదు. అదే సమయంలో టీడీపీ, జనసేన కూటమితో కలిసే ఆలోచనా బీజేపీకి లేదు. దీనికి కారణం జగన్ తో అంతర్గత సంబంధాలు ఉండటం. ఈనేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకు చీల్చి దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ కు భారత రత్నను ప్రకటించాలని భావిస్తోందట.
ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటిస్తే టీడీపీ ఓటు బ్యాంకు తమ వైపు వస్తోందని బీజేపీ భావిస్తోంది. ఫలితంగా టీడీపీని దెబ్బతీయవచ్చు. జగన్ కు మేలు చేయవచ్చన్న ఆలోచన ఉందట. భారత రత్న అవార్డు ఎన్టీఆర్ కు ప్రకటిస్తే.. ఆయన రెండో భార్యగా లక్ష్మీపార్వతి ఆ అవార్డు అందుకుంటుంది. నందమూరి వారసులెవరూ అందుకోలేరు. లక్ష్మీపార్వతి వైసీపీలో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆలోచనలో బీజేపీ ఉందని తెలుస్తోంది.

బీజేపీ నిర్ణయాన్ని ప్రశంసించాల్సిందే. కానీ దీని వెనుక ఉన్న రాజకీయ ఆలోచన మాత్రం ప్రశంసనీయం కాదు. ఓట్లు కావాలంటే ప్రజలకు మంచి చేయాలి. ప్రజాభిమానం చూరగొనాలి. అప్పుడే జనం ఓట్లు వేస్తారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తే కాదు. ఎన్టీఆర్ భారత రత్నను ఓట్ల కోణంలో చూడటం బీజేపీ చేస్తున్న తప్పుగా చెప్పొచ్చు. ప్రతిదీ రాజకీయం చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.