Beggars: దేశంలో బెగ్గింగ్ మాఫియా పెరుగుతోంది. ఆకలితో అలమటించేవారు కొందరైతే.. వారితో వ్యాపారం చేయించేవారు మరికొందరు. సాధారణంగా దివ్యాంగులు, అనాధలు, వృద్ధాప్యం తదితర కారణాలతో యాచక వృత్తిలోకి అడుగుపెడుతుంటారు. ఇటువంటి వారిని ఉపయోగించుకొని బెగ్గింగ్ మాఫియా పెద్ద ఎత్తున దందాకు పాల్పడుతోంది. ఈ విషయం చాలా సార్లు బయటపడింది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బిచ్చగాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా 30 నగరాలను ఎంపిక చేసింది.
అయోధ్య నుంచి తూర్పున గౌహతి వరకు.. పశ్చిమాన త్రయంబకేశ్వరం నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకు 30 నగరాలను ఎంపిక చేసింది. ఈ నగరాల్లో ప్రత్యేక సర్వే చేయించింది. వారందరికీ పునరావాసం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నగరాల్లో బిచ్చగాళ్ళ రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ఇలా గుర్తించిన వారికి స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడంతో పాటు జీవనోపాధికి అవసరమైన మార్గాలను కల్పించనుంది. ఈ కార్యక్రమం మార్గదర్శకాల ప్రకారం భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి ప్రత్యేకంగా నమోదు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పునరావాసం తో పాటు ప్రత్యేక ఉపాధి కల్పించనున్నారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండు నగరాలను ఎంపిక చేశారు. ఏపీకి సంబంధించి విజయవాడ, తెలంగాణకు సంబంధించి వరంగల్ ను ఎంపిక చేయడం విశేషం. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల వివరాలు ఇలా ఉన్నాయి. అయోధ్య, కాంగ్రా, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, సోమనాథ్, త్రయంబకేశ్వర్, బోధగయ, గౌహతి, మధురై తదితర ప్రముఖ ప్రదేశాలను ఎంపిక చేశారు. పర్యాటక ప్రదేశాలుగా ఉన్న విజయవాడ, కెవాడియా, శ్రీనగర్, నంసాయి, కుషినగర్, సాంచి, ఖజురహో, జై సల్మేర్, తిరువనంతపురం, పుదుచ్చేరిలను ఎంపిక చేశారు. చారిత్రక నగరాలైన అమృత్ సర్, ఉదయపూర్, వరంగల్, కటక్, ఇండోర్, కోజికోడ్, మైసూరు, పంచకుల, సిమ్లా, సేజ్ పూర్ వంటి నగరాలను సైతం ఎంపిక చేయడం విశేషం. అక్కడ బిచ్చగాళ్ళను పునరావాసం కల్పించడానికి నగరపాలక సంస్థలతో పాటు మతపరమైన ట్రస్టుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Beggars are not allowed to be seen in those cities