
Indira Gandhi- Rahul Gandhi: రాహుల్ గాంధీ.. భావి భారత ప్రధాని కావాలి అనుకున్నారు.. అందుకే నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. నానమ్మ ఇందిర లాగే పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలని భావిస్తున్నారు.. కానీ ఇప్పటికీ పార్టీపై పట్టుచిక్కలేదు. దీనికి అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువ అని ముక్తాయింపు ఇచ్చుకున్నా అది లెక్కలోకి రాదు.. ఈ క్రమంలో నానమ్మలా ప్రధాని అవుతారో, లేదో తెలియదుగానీ.. ఆమెలాగే అనర్హత వేటుకు మాత్రం గురయ్యారు.. రాహుల్ ఎపిసోడ్ నేపథ్యంలో గతంలో జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి? వీటన్నింటిపై విశ్లేషణాత్మకమైన కథనం ఇది.
1975 లో ఇందిరాగాంధీ కూడా..
1975లో ఇలాగే అనర్హతకు గురయ్యారు. పైగా ఆమె ప్రధానిగా ఉండగానే అనర్హతను ఎదుర్కొన్నారు.. అది చివరికి దేశంలో ఎమర్జెన్సీకి దారితీసింది. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీలో గెలుపొంది ప్రధాని పదవిని చేపట్టిన ఇందిరాగాంధీ.. తాను పోటీ చేసిన రాయ్‌బరేలీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె చేతిలో ఓడిపోయిన రాజ్‌నారాయణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన అలహాబాద్ హైకోర్టు ఇందిర ఎన్నిక చెల్లదంటూ రాజ్‌నారాయణ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై ఆరేళ్లపాటు అనర్హత వేటు పడింది. ఇందిర పైకోర్టుకు వెళ్లి అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. అయితే అప్పుడు ఇందిర అధికారంలో ఉండగా.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రతిపక్షంలో ఉన్నారు.
అంతిమ నిర్ణయం లోక్ సభ ది!
క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుపై గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు స్టే విధిస్తే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం తిరిగి దక్కుతుందా? ఇలాంటి సందర్భాల్లో.. కింది కోర్టు తీర్పు మీద పై కోర్టులు స్టే విధించినా, అంతిమ నిర్ణయం లోక్‌సభ సచివాలయానిదేనని ఎన్సీపీ పార్టీకి చెందిన లక్ష్వదీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఉదంతం స్పష్టం చేస్తోంది. 2009 ఎన్నికల్లో జరిగిన హింసకు సంబంధించి మహమ్మద్ ఫైజల్‌పై నమోదైన కేసును విచారించిన కింది కోర్టు ఈ ఏడాది జనవరి 11న ఆయనను దోషిగా తేల్చి 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో, జనవరి 13న ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ జనవరి 25న ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. స్టే లభించింది. అయినప్పటికీ లక్షద్వీప్ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అప్పటికే ప్రకటించిన ఎన్నికల సంఘం.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తనకు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించినా ఎన్నికలు నిర్వహించడమేంటని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు
ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కేంద్ర న్యాయ శాఖ కూడా సిఫారసు చేసింది. అయినా కూడా ఈ కేసులో ఇప్పటికీ లోక్‌సభ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు స్టే విధించినా తనపై అనర్హత వేటు విధిస్తూ జారీ చేసిన నోటిఫికేషనను రద్దు చేయకుండా స్పీకర్ కార్యాలయం ఫైలును పెండింగ్‌లో పెట్టిందని ఫైజల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను రోజూ పార్లమెంటుకు వస్తున్నానని, కానీ సభలోకి మాత్రం అనుమతించడం లేదని తెలిపారు. అలాగే.. యూపీలో అనర్హత వేటుకు గురైన ఎస్పీ ఎమ్మెల్యే ఆజంఖాన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర సర్కారును ‘ఎందుకంత తొందర’ అంటూ నిలదీసింది. ఆయనకు కనీసం ఊపిరి పీల్చుకునే సమయాన్నైనా ఇచ్చి ఉండాల్సింది అంటూ వ్యాఖ్యానించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదంతాలు. ఇప్పుడు రాహుల్ ఎపిసోడ్ తో మరోసారి చర్చకు వస్తున్నాయి.