
Bandi Sanjay: తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రానున్న ఎన్నికలలో అధికారం చేపట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ మేరకు సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టింది. బీజేపీలో రాష్ట్ర కమిటీతోపాటు, జిల్లా అధ్యక్షుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల టీంను సిద్ధం చేసేపనిలో బీజేపీ నాయకత్వం బిజీ అయింది.
పనిచేయకుంటే పక్కకే..
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించిన బీజేపీ పలు కీలక మార్పులకు సిద్ధమైనట్లు తెలిసింది. పనితీరును బట్టి బాధ్యులను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి మొహమాటాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసేవారికి పట్టం కట్టాలని, పనిచేయని వారిని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అమిత్‌షా నుంచి అనుమతి..
తెలంగాణలో ఎన్నికల టీంను సిద్ధం చేసుకోవడానికి అమిత్ షా నుంచి బండి సంజయ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంత కాలంగా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులపై బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కార్యదర్శులతో, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
గెలిచి.. గెలిపించే వారికి..
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మార్పులు చేర్పులు చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సంస్థాగతంగా పార్టీకి 38 జిల్లాలు ఉండగా, వీటిలో సగానికిపైగా జిల్లా అధ్యక్షుల పనితీరు మెరుగ్గా లేదని అధ్యక్షులను మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక జిల్లా కమిటీల నాయకుల పనితీరు సరిగా లేదని దాదాపు 20 నుంచి 25 జిల్లాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. ఎన్నికల్లో గెలవడంతోపాటు, ఇరుగు పొరుగు నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించే వారికే పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేతల్లో టెన్షన్..
బీజేపీలో మార్పుల ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మరి బండి సంజయ్ వచ్చే ఎన్నికలకు సైన్యాన్ని సిద్ధం చేయటానికి తీసుకునే మార్పులు, చేర్పులు ఏ విధంగా ఉంటాయి. అందరికీ ఆమోదయోగ్యమేనా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరిని తప్పిస్తారు. ఎవరికి పగ్గాలు అప్పగిస్తారనే విషయంలోనూ నేతల్లో టెన్షన్ నెలకొంది. మరి బీజేపీ ఎన్నికల టీం ఎలా ఉంటుందో వేచిచూడాలి.