
Nara Lokesh- Balakrishna: సినిమాల్లో గాని రాజకీయాల్లో గాని నందమూరి బాలకృష్ణది విలక్షణమైన శైలి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు అన్నది బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిన విషయం. బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. తాజాగా ఈ పాదయాత్రలో తలుక్కున మెరిశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అల్లుడుతో కలిసి అడుగులు వేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నందమూరి అభిమానులను అలరించారు బాలయ్య, నారా లోకేష్.
నందమూరి బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వందల రోజులు పాటు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఇదే జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. ఈ జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న అల్లుడు లోకేష్ ను తాజాగా బాలకృష్ణ కలిసి సంఘీభావం ప్రకటించారు. సందర్భంగా పాదయాత్ర వెంబడి లోకేష్ తో కలిసి బాలకృష్ణ అడుగులు వేశారు. మామ, అల్లుళ్లు ఇద్దరు కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇద్దరు కలిసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మామా అల్లుళ్ళ మజాకా అంటూ.. కామెంట్లు చేస్తున్నారు ఇరువురి అభిమానులు.
తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బాలకృష్ణ..
పాదయాత్రలో లోకేష్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చెత్త ప్రభుత్వం అధికారంలో ఉందని మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పులు చేసిన ఆ నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఏపీలో డ్రగ్, ల్యాండ్ మాఫియాలు పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు బాలయ్య. జనం పై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానిది సైకో మనస్తత్వంగా బాలకృష్ణ అభివర్ణించారు. తాను సైకాలజీ చదవకపోయినా.. తనకు మించిన సైక్రియాట్రిస్ట్ ఎవరూ లేరన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలో నాశనమయ్యాయి అని ఆరోపించారు.

యాత్రకు స్పెషల్ అట్రాక్షన్ గా బాలకృష్ణ..
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం పరిధిలో నారా లోకేష్ పాదయాత్రలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మామ అల్లుళ్లు ఇద్దరు టోపీలు ధరించి పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్, బాలకృష్ణ ఇద్దరూ యాత్రకు వచ్చిన పలువురు విద్యార్థులతో ప్లకార్డులు పట్టుకొని నిరసనను తెలియజేశారు. ప్రతి గంజాయి కేసులో వైసీపీ నేత లింకు దొరుకుతోంది అన్న ఫ్లకార్డులను ఈ సందర్భంగా వీరిద్దరూ ప్రదర్శించారు.