https://oktelugu.com/

Balagam : బలగం సినిమానే కాదు.. పల్చబడి పోతున్న మన బంధాలనూ ప్రశ్నిస్తోంది

Balagam : ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకోవడమే అరుదు. అలాంటిది ఊరంతా ఒక్క చోటికి చేరి మనస్ఫూర్తిగా మాట్లాడుకుని, కంటి నిండా ఏడవటం అంటే మాటలా! తనివి తీరా ముచ్చట్లు అంటే మాటలా! ఇప్పుడు ఈ ట్రెండ్ ను బలగం సినిమా నెలకొల్పుతోంది. పల్చబడిన మన బంధాలను, పైసల కోసం వెంపర్లాడుతున్న మన మనస్తత్వాలను ప్రశ్నిస్తోంది. అప్పట్లో రామాయణం, దానవీరశూరకర్ణ, అల్లూరి సీతారామరాజు, మిస్సమ్మ, గుండమ్మ కథ, అన్నమయ్య, సూర్యవంశం, అమ్మోరు, […]

Written By:
  • Rocky
  • , Updated On : April 2, 2023 4:43 pm
    Follow us on

    Balagam : ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకోవడమే అరుదు. అలాంటిది ఊరంతా ఒక్క చోటికి చేరి మనస్ఫూర్తిగా మాట్లాడుకుని, కంటి నిండా ఏడవటం అంటే మాటలా! తనివి తీరా ముచ్చట్లు అంటే మాటలా! ఇప్పుడు ఈ ట్రెండ్ ను బలగం సినిమా నెలకొల్పుతోంది. పల్చబడిన మన బంధాలను, పైసల కోసం వెంపర్లాడుతున్న మన మనస్తత్వాలను ప్రశ్నిస్తోంది.

    అప్పట్లో రామాయణం, దానవీరశూరకర్ణ, అల్లూరి సీతారామరాజు, మిస్సమ్మ, గుండమ్మ కథ, అన్నమయ్య, సూర్యవంశం, అమ్మోరు, పుట్టింటికి రా చెల్లి వంటి సినిమాలకు జనం బండ్లు కట్టుకుని మరి వెళ్లారు. ఇప్పుడు ఈ స్మార్ట్ యుగంలో బండ్లు లేవు కాబట్టి, ఉన్నా ఉపయోగించేవారు లేరు కాబట్టి.. ప్రత్యేకంగా వాహనాలను కిరాయి తీసుకొని మరీ బలగం సినిమాకు వెళ్తున్నారు. దసరా సినిమా మానియాను కూడా తట్టుకోని నిలబడిందంటే బలగం సినిమాకి ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. విడుదలైన 25 రోజులకే ఈ సినిమా ఆమెజాన్ లో స్ట్రీమ్ అవుతోంది. అయినప్పటికీ థియేటర్లలో ఇంకా ఫుల్ రన్ కొనసాగుతూనే ఉంది.

    ఇక ఈ సినిమాలో గుండెల్ని కదిలించే సెంటిమెంట్ ఉండడంతో పలుచోట్ల గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు.. ఈ విధానానికి శ్రీకారం చుట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా వాస్తవ్యవులు. కోనరావుపేట మండలం వట్టి మల్ల లో ఉగాది సందర్భంగా తొలి స్క్రీనింగ్ జరిగింది. ఈ చిత్రాన్ని చూసేందుకు గ్రామంలోని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. తనివి తీరా ఏడ్చారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో కొమురయ్య ఫ్యామిలీ ఫోటో చూడగానే పిట్ట ముట్టిన విధానం చూసి ఒక్కొక్కరు కళ్ళల్లో నీళ్లు ఏడ్చారు.

    అప్పట్లో మాతృదేవోభవ సినిమా చూసి చాలామంది ఏడ్చారు. ఏకంగా థియేటర్లలో కర్చీప్ లు కూడా అమ్మారు. శివరామరాజు సినిమా చూసి కొన్ని కుటుంబాలు కలిశాయి..ఇప్పుడు బలగం సినిమాను చూసి చాలా కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఇందులో గొప్ప కథ అంటూ ఏం లేదు. గొప్ప సంగీతం కూడా ఏమీ లేదు.. కానీ ఇది మన కథ. మనం మర్చిపోయిన బంధాల కథ, డబ్బు యావలో పడి మనల్ని మనం దూరం చేసుకుంటున్న కథ… అందుకే ఇవాళ బలగం యావత్తు తెలుగు ప్రజలకు నచ్చింది. మన గుండెను మెలిపెడుతోంది. సినిమా తీసిన వేణు కు సగర్వంగా చేతులెత్తి మొక్కుతోంది.