
Balagam – Venu : ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా ఆయన బలగం టైటిల్ తో ఎమోషనల్ విలేజ్ డ్రామా తెరకెక్కించారు. బలగం చిత్రం పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది. కాగా గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ఈ చిత్ర కథ నాదే అంటూ ఆరోపిస్తున్నారు. గతంలో తాను రాసిన పచ్చుకి అనే కథకు నామమాత్రపు మార్పులు చేసి బలగం మూవీ తీశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు వేణు స్పందించారు. ఆయన గడ్డం సతీష్ పై పరుష వ్యాఖ్యలు చేశారు.
నేను ఆరేళ్ళు శ్రమించి బలగం చిత్ర కథ రాసుకున్నాను. గడ్డం సతీష్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆయన రాసిన కథ నేను చదవలేదు. పక్షి ముట్టుడు అనే కామన్ పాయింట్ ఆధారంగా కథ నాదే అనడం సబబు కాదు. కాకి ముట్టుడు అనేది తెలంగాణా సాంప్రదాయం మాత్రమే కాదు. అది తెలుగువారందరి సాంప్రదాయం. అలాగే హిందూ సాంప్రదాయం. వందల ఏళ్లుగా ఉన్న సంస్కృతి ఎవరి సొత్తు కాదు. దాని మీద ఎవరైనా స్పందించవచ్చు.
పెళ్లిలో అనేక సాంప్రదాయాలు ఉంటాయి. మనిషి మరణించాక కాకి ముట్టడు కూడా అలాంటిదే. ఈ విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి. కథ నాది, చిత్ర దర్శకుడు నేను కాబట్టి. దిల్ రాజుపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు. నిజంగా ఆయన రాసిన కథ కాపీ కొడితే అసోసియేషన్స్ ఉన్నాయి.అక్కడ ఫిర్యాదు చేయమనండి. ఆయన కోర్టుకు వెళతా అంటున్నారు. సంతోషం… చట్టమే తేల్చుతుంది. నా సినిమాను, నన్ను బద్నామ్ చేస్తున్నందుకు నేనే కోర్టులు వెళ్లాలి అనుకుంటున్నా. బలగం మూవీ అనేక మంది తెలంగాణా రచయితలకు, దర్శకులకు ఊపిరి పోసింది. పరిశ్రమకు వచ్చేందుకు స్ఫూర్తినిచ్చింది.
గడ్డం సతీష్ కి రైటింగ్ టాలెంట్ ఉంటే పరిశ్రమకు రమ్మనండి. దిల్ రాజు వంటి నిర్మాతలు ప్రోత్సహిస్తారు. అంతే కానీ ఇలా చిల్లర చేయడం సరికాదన్నారు. బలగం మూవీని పోలిన సినిమాలు కన్నడ, కొరియా భాషల్లో కూడా ఉన్నాయి.అంత మాత్రాన వారు కూడా తన కథను కాపీ కొట్టినట్లేనా అని వేణు ప్రశ్నించారు. కాగా దిల్ రాజు వివాదానికి తెరదింపే ప్రయత్నం చేశాడట. గడ్డం సతీష్ కి డబ్బులు ఇస్తాం, సైలెంట్ అవ్వమని చెప్పారట. అయితే గడ్డం సతీష్ టైటిల్ క్రెడిట్ కావాలని డిమాండ్ చేశాడట. ఇక వివాదం కొనసాగుతుండగా ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.