
Thammineni Sitaram: ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చీట్ చేశారా? విద్యార్హతల విషయంలో నకిలీ ధ్రువపత్రాలు చూపించారా? డిగ్రీ చేయకుండానే మూడేళ్ల లా కోర్సును పొందారా? ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్. తమ్మినేని సీతారాంను టార్గెట్ చేస్తూ టీడీపీ ఆరోపణలు తీవ్రతరం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతితో పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేస్తోంది. తొలుత తెలంగాణకు చెందిన టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని మూడేళ్ల ‘లా’ కోర్సులో అక్రమంగా చేరారంటూ ఆరోపించారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు స్వయంగా ప్రకటించుకున్న తమ్మినేని.. లా కోర్సులో ఏ అర్హతతో చేరారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీతారామ్‌కు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు ఏమైనా మినహాయింపు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై ఏకంగా ఆధారాలతో ఫిర్యాదుచేశారు మరో టీడీపీ నేత కూన రవికుమార్.
డిగ్రీ పూర్తికాలేదన్న సభాపతి..
గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శాసనసభ్యుడు తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎన్నుకున్నారు. అయితే ఉన్నత చదువు కోసం ఓయూ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీ లో ఎల్ఎల్‌బీ అడ్మిషన్ తీసుకున్నారు. మూడేళ్ల ఈ కోర్సు చదవాలంటే డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి . లేకుంటే డిగ్రీకి సమానమైన కోర్సు పూర్తి చేసిన వారు లా కోర్సు చేయడానికి అర్హులు. కానీ డిగ్రీ మధ్యలో ఆపేసినట్టు తమ్మినేని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల అఫిడవిట్ లో సైతం అలానే పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పడు టీడీపీ నేతలు కూడా దీనినే కార్నర్ చేస్తున్నారు. డిగ్రీ సర్టిఫికేట్ ఏ విధంగా సంపాదించారో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఏకంగా రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వాటిని ఆధారంగా చేసుకొని…
స్పీకర్ తమ్మినేని సీనియర్ నాయకుడు. మంచి వాగ్ధాటి ఉన్న నేత. సాధారణంగా ఆయన మాటలు వింటే విద్యాధికుడిగా భావిస్తారు. కానీ ఆయన డిగ్రీ పూర్తిచేయలేదని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సైతం చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానినే టీడీపీ హైప్ చేస్తోంది. వాటి ఆధారంగా రాజకీయ ప్రత్యర్థి, సమీప బంధువైన టీడీపీ నేత కూన రవికుమార్ పావులు కదుపుతున్నారు. మహాత్మాగాంధీ లా కాలేజీ యాజమాన్యం తమ్మినేని లాంటి హైప్రొఫైల్ వ్యక్తులకు మూడేళ్ల లాకోర్సు అడ్మిషన్ కు ఏమైనా మినహాయింపు ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. తమ్మినేని కేవలం ఆముదాలవలస ఎమ్మెల్యే మాత్రమే కాదని, అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల్ని నడిపించే స్పీకర్ కూడా అని గుర్తుచేస్తున్నారు.గౌరవ ప్రదమైన స్ధానంలో ఉంటూ నకిలీ విద్యార్హతలతో లాకోర్సు అడ్మిషన్ పొందడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. తమ్మినేనిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి, గవర్నర్లు, సీఎం, సీజేఐకి ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీలో కలవరం..
అయితే ఇప్పుడు స్పీకర్ చీటింగ్ వ్యవహారమంటూ ప్రచారం జరుగుతుండడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రావడంతో ఎలా ముందుకెళ్లాలో తెలియక వైసీపీ మల్లుగుల్లాలు పడుతోంది. అసలు వాస్తవం ఏమిటని ఆరాతీసే పనిలో పడింది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపజయం, పార్టీలో ధిక్కార స్వరాలు పెరగడం, కడపలో దళిత అధికారి డాక్టర్ అచ్చెన్న హత్య వంటి పరిణామాలతో జగన్ సర్కారు ఉక్కిరిబిక్కరవుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏకంగా స్పీకర్ పై చీటింగ్ ఆరోపణలు రావడంతో అధికార పార్టీలో ఒకరకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. నిజయంగా స్పీకర్ చీట్ చేశారా? లేకుంటే టీడీపీ అవనసర ఆరోపణలు చేస్తోందా? అన్నదానిపై తమ్మినేని ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. అటు లా కాలేజీ యాజమాన్యం సైతం స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే ఇది విపక్షాలకు మాత్రం బ్రహ్మాస్త్రంగా మారే చాన్స్ కనిపిస్తోంది.