https://oktelugu.com/

Aliens: గ్రహాంతర వాసులు ఉన్నారా?: నాసా నివేదిక ఏం చెబుతోందంటే

ఎగిరే పళ్లేలుగా వ్యవహరించే యూఎఫ్ వో (అన్‌ ఐడెంటిఫయింగ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌)లపై ప్రపంచమంతా చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నివేదికను నాసా విడుదల చేసింది.

Written By:
  • Rocky
  • , Updated On : September 16, 2023 / 06:07 PM IST

    Aliens

    Follow us on

    Aliens: కంటికి కనిపించే ఏదో చిత్రమైన రూపం ఆసక్తి కలిగిస్తోంది. దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే వాటికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు గ్రహాంతర వాసులు. అయితే అవి ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? ఏం చేస్తుంటాయి? దీనిపై నాసా ఒక ఆసక్తికరమైన నివేదిక విడుదల చేసింది.

    ఎగిరే పళ్లేలుగా వ్యవహరించే యూఎఫ్ వో (అన్‌ ఐడెంటిఫయింగ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌)లపై ప్రపంచమంతా చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నివేదికను నాసా విడుదల చేసింది. యూఎ్‌ఫవోలను ఈ నివేదికలో.. యూఏపీ (అన్‌ ఐడెంటిఫైడ్‌ ఏరియల్‌ ఫినామినా)గా వ్యవహరించిన నాసా.. అవన్నీ గ్రహాంతరవాసులవేనని చెప్పడానికి ఎలాంటి హేతువూ లేదని అభిప్రాయపడింది. వీటిని భూ గోళానికి సంబంధించిన అతిగొప్ప రహస్యాల్లో ఒకటిగా అభివర్ణించింది. యూఎ్‌ఫవోలకు సంబంధించి చాలా దృశ్యాలు, ఎంతో మంది అనుభవాలు ఉన్నప్పటికీ.. సవివరమైన, స్థిరమైన పరిశీలనలేవీ లేవని, కాబట్టి వాటిపై స్పష్టమైన, శాస్త్రీయ నిర్ధారణలకు రావడానికి అవసరమైన సమాచారం లేదని వివరించింది. వాటిపై అధ్యయనానికి మరిన్ని కొత్త శాస్త్రీయ పరిజ్ఞానాలు, మరింత అత్యంత అధునాతన ఉపగ్రహాలు కావాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రోదసిలో ఉన్న శాటిలైట్లు.. చాలా చిన్నగా ఉండే యూఏపీలను గుర్తించలేవని పేర్కొంది.

    ఇప్పటి వరకూ గుర్తించిన యూఎ్‌ఫవోల్లో కొన్నింటి వేగం.. ఇప్పటివరకూ మనకు తెలిసిన వైమానిక పరిజ్ఞానాలను మించినదని వెల్లడించింది. ఈ మిస్టరీని ఛేదించడానికి, యూఏపీల మూలాలను కనుగొనాలంటే.. నాసాకున్న విస్తృత సాంకేతిక పరిజ్ఞానానికి, శాస్త్రజ్ఞుల నైపుణ్యానికి కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) కూడా తోడవ్వాలని, ఓపెన్‌సోర్స్‌ యాప్‌ల ద్వారా ప్రజలను కూడా ఈ పరిశోధనల్లో భాగస్వాములను చేయాలని సూ చించింది. కాగా.. యూఏపీలపై మరింత సమాచారాన్ని సేకరించాలంటూ నిపుణుల ప్యానెల్‌ ఒకటి సూచించిన నేపథ్యంలో.. వీటిపై పరిశోధనకు నాసా ‘డైరెక్టర్‌ ఫర్‌ యూఏపీ’ని నియమించింది. వెయ్యేళ్లనాటి గ్రహాంతరవాసుల మృతదేహాలు దొరికాయంటూ.. మెక్సికో చట్టసభలో వాటిని ప్రదర్శించిన మర్నాడే నాసా ఈ నివేదికను విడుదల చేయడం విశేషం. అంతేకాదు.. విశ్వంలో ఎక్కడో ఒకచోట జీవం ఉందనే విషయాన్ని తాను నమ్ముతున్నానని నాసా చీఫ్‌ బిల్‌ నెల్సన్‌ పేర్కొనడం గమనార్హం.

    రెండు కళేబరాలు గుర్తించారు

    గ్రహాంతరవాసులు ఉన్నారా..? ఉంటే ఇన్నేళ్లుగా ఎందుకు కనిపించలేదు..? అసలు ఎలా ఉంటారు? గ్రహాంతరవాసులు ఉన్నారు అని అమెరికా ఇటీవల అధికారికంగా ధ్రువీకరించినప్పటి నుంచీ ప్రజ ల్లో ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానమా అన్నట్లుగా గ్రహాంతరవాసులవిగా చెబుతున్న రెండు కళేబరాలను పాత్రికేయుడు, గుర్తుతెలియని ఎగిరే వస్తువుల(యూఎ్‌ఫవో) రంగ నిపుణుడు జేమీ మౌసన్‌ మెక్సికోలో తాజాగా ప్రదర్శించారు. ‘‘పెరూలోని కుస్కో నగరంలో గనుల్లో ఇవి బయటపడ్డాయి. ఈ రెండు కళేబరాలను ఇక్కడి అటానమస్‌ నేషనల్‌ వర్సిటీ ఆఫ్‌ మెక్సికో పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇవి వెయ్యేళ్ల క్రితానికి చెందినవని నిర్ధారించారు. ఆస్మియం వంటి అరుదైన లోహాలు వీటి వేలికి, కొన్ని అవయవాలకు ఉన్నాయి’’ అని జేమీ తెలిపారు. ఈ మృతదేహాలకు తీసిన ఎక్స్‌రేలనూ ప్రదర్శించారు. రెండింటిలో ఒక దేహంలో మూడు అండాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో పలు రంగాల పరిశోధకులు, మెక్సికో చట్టసభల సభ్యులు, అమెరికాకు చెందిన నిపుణులు ఉన్నారు.