Bathukamma Song: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన బతుకమ్మ పాట విడుదలైంది. ‘అల్లిపూల వెన్నెల’ అనే ఈ పాటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించాడు. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు.

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వ యవనికపై ఈపాటతో మారుమోగుతోంది. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ ఆవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’గా సరికొత్త సొబుగులు అద్దనుంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు.
దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పూల సింగిడిని ఇవాళ ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖు రచయిత మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ ను అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియో గ్రఫీ చేశారు. అక్టోబర్ 6 నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరుగనుంది.
తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రేపటి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ ‘అల్లిపూల వెన్నెల’ పాట విడుదలైంది. తెలంగాణ ఆడపడుచుల నోట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ పాట ప్రతిధ్వనించనుంది.
ఈ పాటను విడుదల చేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు. ‘బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’ తెలిపారు.
