Roja Anshu : సినిమాల్లో ఒకప్పుడు ఒకతరాన్ని ఊపేసిన రోజా.. సినీ అవకాశాలు తగ్గాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది. అయితే ఇప్పటికీ తనకు సినిమాలతో ఉన్న అనుబంధాన్ని మాత్రం రోజా తెంచుకోవడం లేదు. బుల్లితెర జబర్ధస్త్ నుంచి కీలకమైన షోలలో పాల్గొంటూనే ఉంటోంది. మంత్రి అయ్యాక కాస్త తగ్గించినా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీతో ఆమె అనుబంధం చెక్కు చెదరలేదు.

రాజకీయాల్లోకి వచ్చాక దాదాపు సినిమాల్లో నటించడం మానేసిన రోజా మంత్రి అయ్యాక పూర్తిగా ప్రజాసేవకే అంకితమైంది. రోజా సినీ వారసత్వాన్ని కొనసాగించడానికి ఇప్పుడు ఆమె పిల్లలు రెడీ అయిపోయారు. రోజా కూతురు అన్షుమాలిక చదువుల్లో టాపర్. ఆమె ఇదివరకు ఒక బుక్ కూడా రాశారు. సైంటిస్ట్ అవ్వాలని యూరప్ లో పెద్ద పెద్ద చదువులను అన్షు చదువుతోంది.
రోజాలోని అందం, అభినయం, చలాకీతనం ఆమె కూతురు అన్షు మాలికలో ఉంటాయి. ఆమె హీరోయిన్ గా వస్తే అవకాశాలు క్యూ కడుతాయని.. రోజాలా పెద్ద హీరోయిన్ అవుతుందని సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇదే విషయం రోజా వరకూ కూడా చాలా సార్లు వచ్చిందట.. అన్షును హీరోయిన్ గా పరిచయం చేయించండి అంటూ కొందరు డైరెక్టర్లు కోరినట్టు సమాచారం.
తాజాగా రోజా కూతురు అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందన్న వార్తలు వచ్చాయి. దీనిపై సీనియర్ హీరోయిన్ కం మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. ‘తన పిల్లలు సినిమాల్లోకి వస్తే మొదట సంతోషించేదాన్ని నేనే. ఒక తల్లిగా.. హీరోయిన్ గా వారికి అండగా ఉంటాను.. సినిమాల్లో ముందుండి నడిపిస్తాను. నటించడం ఎంత మాత్రం తప్పుకాదు. కానీ నా కూతురు అన్షుకి బాగా చదువుకొని సైంటిస్ట్ అవ్వాలని కోరిక. ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఆమెకు లేదు’ అంటూ రోజా స్పష్టతనిచ్చారు.
దీంతో రోజా కూతురు సినిమాల్లోకి ఎంట్రీ అన్నది ఒట్టి గాలి వార్త అని తేలిపోయింది.