
TDP- AP MLC Elections: ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. మొత్తం మూడు స్థానాలకుగాను రెండుచోట్ల టీడీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. ఒకచోట మాత్రం వైసీపీకి స్వల్ప ఆధిక్యత లభించింది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల్లోపు తుది ఫలితాలు వెల్లడయ్యే చాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ బలపరచిన వేపాడ చిరంజీవిరావు 20,310 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 58,957 ఓట్లు, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు 38,647 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 23,575 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ 6,928 ఓట్లు లభించాయి. మొత్తం 8 రౌండ్లకు గాను ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. తొలి ప్రాధాన్యం ఓట్లతో గెలుపొందుతానని టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు నమ్మకంగా చెబుతున్నారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో సైతం టీడీపీ ఆధిక్యత కొనసాగుతోంది. ఆ పార్టీ బలపరచిన కంచకర్ల శ్రీకాంత్ 9,558 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఇక్కడ మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి శ్రీకాంత్ కు 49,173 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 39,615 ఓట్లు వచ్చాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. అక్కడ వైసీపీ బలపరచిన వెన్నెపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాలరెడ్డికి 26,929 ఓట్లు వచ్చాయి. సాయంత్రం ఐదు గంటల్లోగా తుది ఫలితాలు వెల్లడయ్యే చాన్స్ ఉంది.

ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ను గమనిస్తే ఉత్తరాంధ్ర, తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకునే చాన్స్ ఉంది. పశ్చిమ రాయలసీమ స్థానాన్ని స్వల్ప ఆధిక్యంతో వైసీపీ నిలబెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ తొలి ప్రాధాన్యంలో విజేత తేలకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించే చాన్స్ ఉంది. టీడీపీ, లెఫ్ట్ పార్టీల మధ్య రెండో ప్రాధాన్యత ఓట్లు పంచుకోవాలని అవగాహన ఉండడంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉండడమే ఇందుకు కారణం. అయితే ఉపాధ్యాయుల స్థానాలను వైసీపీ దక్కించుకోవడం కాస్తా ఉపశమనం కలిగించే విషయం. అయితే పట్టభద్రుల స్థానాల్లో మాత్రం టీడీపీ పైచేయిసాధించడం అధికార వైసీపీకి మింగుడుపడడం లేదు.