Anup Kumar Mumbai: ఏ కాకి కూడా ఏకాకి గా ఉండాలని కోరుకోదు. అలా ఉండడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఒంటరితనం అనేది నరకం లాంటిది. పక్షి కే అలాంటి ఇబ్బంది ఉంటే.. ఇక మనుషులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్లే మనుషులు సమూహంలో ఉంటారు. సమూహంగా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబ జీవనానికి ఇష్టపడుతుంటారు.
Also Read: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ లో అది ఒకే…కానీ ఆ ఒక్కటి మైనస్..గమనించారా..?
సామూహిక జీవనంలో మనుషుల భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల బాధలు తగ్గుతాయి. సంతోషాలు పెరుగుతాయి. అనుబంధాలు దృఢమవుతాయి. భూమి మీద పుట్టిన మనుషులందరికీ సామూహిక జీవనాన్ని ఆస్వాదించే అవకాశం ఉండదు. కొంతమందికి అనుకోని సంఘటనల వల్ల ఒంటరితనం అలవాటవుతుంది. ఫలితంగా వారు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిదే ఈ ఐటీ ఉద్యోగి జీవితం కూడా.
అతని పేరు అనూప్ కుమార్.. వయసు 55 సంవత్సరాలు.. అతని వైవాహిక జీవితం గురించి ఎటువంటి సమాచారం లేదు. కాకపోతే అతడు ఉన్నత చదువులు చదివాడు. ఓ ఐటీ కంపెనీలో కొలువులో చేరాడు. అందులో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నవీ ముంబై ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే అనూప్ కుమార్ తల్లిదండ్రులు సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆ తర్వాత అతడి సోదరుడు కూడా కన్నుమూశాడు. అప్పటిదాకా కళకళలాడిన అతని కుటుంబం ఒక్కసారిగా కళ తప్పింది. అనూప్ కుమార్ ఒంటరివాడయ్యాడు. చేతినిండా డబ్బు ఉన్నప్పటికీ.. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ అవేవీ అతడికి సంతృప్తి ఇవ్వలేకపోయాయి. దీంతో అనూప్ కుమార్ మానసికంగా కుంగిపోయాడు. బయటికి వెళ్లే సాహసం చేయలేకపోయాడు. అపార్ట్మెంట్లోనే తనను తాను బంధించుకున్నాడు. డెలివరీ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునేవాడు. చివరికి ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ఒంటరిగా ఉంటూ తనలో తానే కుమిలిపోయేవాడు.. ఈ క్రమంలోనే అతడి కాలికి గాయమైంది. తీవ్రంగా ఇన్ఫెక్షన్ సోకింది. అయినప్పటికీ అతడు అలానే ఉన్నాడు.
అనూప్ కుమార్ నివాసం ఉన్న అపార్ట్మెంట్ లో మిగతావారు అతని పరిస్థితిని ఓ ఎన్జీవో సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సంస్థ అనూప్ ను బయటికి తీసుకొచ్చింది. జుట్టు పెరగడంతో అతడు పిచ్చివాడిలాగా కనిపించాడు. దీంతో ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్లు అతడికి క్షవరం చేయించారు. అతడికి మానసిక సమస్యలు ఉన్న నేపథ్యంలో చికిత్స అందిస్తున్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమంలో అతడికి ఆవాసం కల్పించారు. అతడుకుంటున్న ప్లాట్ ను శుభ్రం చేశారు. అందులో ఉన్న చెత్తను మొత్తం బయటపడేశారు. అతని కాలికి గాయం అయిన నేపథ్యంలో.. చికిత్స చేయిస్తున్నారు..
తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయిన నేపథ్యంలో అనూప్ మానసిక వ్యధకు గురైనట్టు తెలుస్తోంది.. ఇతర వ్యక్తులతో మాట్లాడడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. చివరికి ఫుడ్ డెలివరీ కి సంబంధించి సైగల ద్వారానే వారికి చెల్లింపులు చేసేవాడని సమాచారం. ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని సమాచారం. ప్రస్తుతం స్వతంత్ర సంస్థ నిర్వాహకుల ఆశ్రమంలో అతడు చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు. అయితే వివాహం ఎందుకు చేసుకోలేదు? మీ బంధువులు ఎవరూ లేరా? మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఇలా ఎందుకు మారిపోయారు? ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారు? అనే ప్రశ్నలకు మాత్రం అతడు సమాధానం ఇవ్వడం లేదు. ఆ ప్రశ్నలు అడిగితే కంటతడి పెట్టుకుంటున్నాడు. మొత్తంగా చూస్తే అనూప్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.