
KCR Survey: ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీనికి తోడు వరుస సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. మరో వైపు ఎమ్మెల్యేల దందాలు శృతి మించిపోతున్నాయి.. ఈ క్రమంలో కెసిఆర్ రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
మరో మారు సర్వే
ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సర్వే నిర్వహిస్తున్నారు.. రహస్యంగా సాగుతున్న ఈ ప్రక్రియలో ఢిల్లీకి చెందిన ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. 21 ప్రశ్నలతో కూడిన ఈ సర్వే… తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కొనసాగుతోంది.. ఎమ్మెల్యేలే కాదు ఎంపీల పనితీరుపై కూడా ఈ సర్వే చేస్తున్నట్టు వినికిడి. మీ ఎమ్మెల్యే ఎలాంటివారు? సమస్యలతో మీరు ఆయనను కలిస్తే పరిష్కార మార్గం చూపారా? ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి జరుగుతోందా? ఎమ్మెల్యే అనుచరులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? మీ గ్రామానికి ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారు? ఎలాంటి హామీలు ఇచ్చారు? వాటిని నెరవేర్చారా? ఇలాంటి ప్రశ్నలతో ప్రజలను నేరుగా ఆ ఏజెన్సీకి సంబంధించిన వారు అడుగుతున్నారు.
ఎప్పటికప్పుడు నివేదిక
అయితే ఇటీవల నిర్వహించిన టిఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే తాజా సర్వేలో 25 మంది ఎమ్మెల్యేలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.. పైగా వీరిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరికి టికెట్లు ఇస్తే గెలవడం కష్టమే అని అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.. అయితే వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా పెడితే బాగుంటుందో కూడా ఆ ఏజెన్సీ బృందం ప్రజలను అడుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే వారు చెప్పిన దాని ప్రకారమే ఆ నియోజకవర్గాల్లో నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు వినికిడి. మరోవైపు ఆ నియోజకవర్గాల్లో కూడా గెలిచి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కెసిఆర్ తాపత్రయపడుతున్నారు..

అసంతృప్తులకు గాలం
మరోవైపు తమకు టికెట్ రాదని సమాచారం ఉన్న కొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష పార్టీలు గాలం వేస్తున్నాయి. ఇందులో బిజెపి ముందుంది. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ వారితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.. పైగా వారికి పార్టీలో చేరితే ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో ఎన్నికలు కొద్ది నెలలు ముందు ఉండగానే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇక మునుముందు ఎలా ఉంటుందో వేచి చూడాలి.