
New District In AP: ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. తమకు మంచి చేయకపోగా కీడు తలపోస్తున్నారని ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత నాటుకుపోయి ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్న వైసీపీ అధిష్టానం తాజాగా కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు. ఆ మేరకు రాబోయేది మంచి రోజులని చెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో తీపి కబురు చెప్పబోతున్నట్లు వైసీపీ డిప్యూటీ సీఎం లీకేజీలు ఇస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. దాంతో అప్పటి వరకు ఉన్న 13 జిల్లాలు 27 అయ్యాయి. పాలన సౌలభ్యం కోసమే విభజించినట్లు జగన్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ తరువాతే ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అధికారులకు స్థానచలనం కల్పించారు. కొత్త జిల్లాల్లో బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. కార్యాలయాల ఏర్పాటు కూడా జరగని చోటుకు వెళ్లి ఉద్యోగులు కష్టపడాల్సి వచ్చింది. కొత్త జిల్లాల కలెక్టరేట్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, వివిధ శాఖల భవనాల ఏర్పాటు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. జిల్లా కేంద్రాల ఏర్పాటుతో ప్రజల పాలన మరింత దగ్గరవుతుందనేది అపోహగా మిగిలిపోయింది.
ఇప్పుడు మరో జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర సంకేతాలు ఇస్తున్నారు. ఉత్తరాంధ్రలో సమస్యలను పట్టించుకోకపోగా, కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రయోజనం ఏముందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన జిల్లాల పునర్విభజనలో అరకు పార్లమెంటును రెండుగా విభజించారు. దాంతో అక్కడ అంత ఓకే అన్న పరిస్థితి ఇప్పటికీ లేదు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలవాసుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంపై గుర్రుగా ఉన్నారు.

గిరిజన ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు చాలానే ఉన్నాయి. సరైన వైద్య, రవాణా, విద్య సదుపాయాల్లేవు. వైద్యానికి డోలీలపై సమీపంలోని పట్టణ ప్రాంతాలకు రోగులను తరలించాల్సి ఉంటుంది. దాంతో, ఎన్నికల సమీపిస్తున్న సమయంలో గిరిజనుల ఓట్లపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం మరలా గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పే ప్రయత్నం ప్రారంభించింది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రెండుగా చేసిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు మరో చీలికను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదన కొత్త జిల్లాల ప్రకటన సమయంలోనే ఉన్నప్పటికీ స్థానిక సమస్యల నేపథ్యంలో వాయిదా వేశారు. మరలా ఆ ప్రతిపాదనపై తెరపైకి తీసుకువచ్చి పోలవరం గ్రామాలతో పాటు మరికొన్నింటిని కలిసి అరకు ఎంపీ సీటును జిల్లాగా చేయనున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా కసరత్తు చేపట్టిందని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ఉత్తరాంధ్రవాసులను ఆకట్టుకునేందుకు ఇంకెన్ని లీకుల సమాచారాలు ఇస్తారో వేచి చూడాల్సిందే.