Ankit Agarwal Phool: కాదేదీ కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ.. కానీ నేటి సమాజంలో కాదేదీ వినియోగానికి అనర్హం అని నిరూపిస్తోంది యువత. వాడి పడేసే వస్తువులను కూడా, వృథాగా పడేసే కొబ్బరి బోండాలు.. ప్లాస్టిక్ బాటిళ్లు, పూజించిన పూలను.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అనేక రకాల వృథాల వస్తువులను తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. వ్యర్థాలకు కొత్త అర్థం చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్‌ను దారాలుగా మార్చి జీన్స్ ప్యాంట్లు తయారు చేస్తున్నారు. కొబ్బరి బోండాలతో పీజు తాళ్లు, మండే పదార్థాలు తయారు చేస్తున్నారు. ఇక దేవుడికి పూజించిన పూలతో సుగంధ భరితమైన అగర్‌బత్తులను తయారు చేస్తున్నారు.
నిత్యం వేల టన్నుల్లో పూలు..
హిందూ దేశమైన భారత్‌లో నిత్యం అనేక దేవాలయాల్లో టన్నుల కొద్దీ పూలను పూజకు వినియోగిస్తారు. మరుసటి రోజు ఆ పూలను బయట పడేయడమో లేక అన్నీ కలిపి ఒకేసారి నీటిలో కలపడమో జరుగుతోంది. ఇలా వృథా అవుతున్న పూలను తిరిగి వినియోగంలోకి తేవాలని ఆలోచించారు ఇద్దరు స్నేహితులు అంకిత్ అగర్వాల్, ప్రతీక్ కుమార్. వారి ఆలోచన నుంచి పుట్టిందే పూలతో ప్రీమియం అగర్‌బత్తుల తయారీ..
ఫూల్ బ్రాండ్ పేరుతో..
2017లోనే అంకిత్ అగర్వాల్, ప్రతీక్ కుమార్ ఫూల్ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. దేశంలోని దేవాలయాల్లో అలంకరణ, పూజకు ఉపయోగించిన పూలను తిరిగి సేకరించాలని నిర్ణయించారు. వాడిన పూలతో అగర్‌బత్తీల తయారీ ప్రారంభించారు. ఆలయాల నుంచి నిత్యం టన్నుల కొద్దీ పూలను సేకరించి వాటిలోని సుగంధ భరితమైన పూలను వేరు చేస్తున్నారు. వాటిని నీడలో ఆరబెట్టి.. తర్వాత పౌడ్‌గా చేస్తున్నారు. వీటికి మరికొన్ని సుగంధాలను జోడించి సువాసన భరితమైన అగర్‌బత్తీ పేస్ట్ తయారు చేస్తున్నారు.
మార్కెట్‌లో పోటీకి దీటుగా..
అయితే ఇప్పటికే మార్కెట్‌లో అనేక బ్రాండెడ్ అగర్‌బత్తీ కంపెనీలు ఉన్నాయి. అయినా ఇద్దరు మిత్రులు వాటిని దీటుగా ఎదుర్కొంటున్నారు. ప్రీమియం ధరలకే అగర్‌బత్తీలను సంపన్నులకు విక్రయిస్తున్నారు. ఆలయాలకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తున్నారు. ఇలా తమ ఆలోచనతో నెలకు లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నారు. మరోవైపు వందల మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అనతి కాలంలోనే పూల్ కంపెనీ కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది.