Anand Mahindra: ఆ బాలిక చేసిన పనికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. భారీ జాబ్ ఆఫర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో 13 సంవత్సరాల నిఖిత అనే బాలిక తన కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఆ ప్రాంతంలో కోతులు బెడద చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో తన ఇంట్లోకి ప్రవేశించిన కోతులను భయపెట్టి బయటికి వెళ్లగొట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 7, 2024 10:10 am

Anand Mahindra

Follow us on

Anand Mahindra: అపాయం ఎదురైనప్పుడే ఉపాయం ఆలోచించాలి. దాని ద్వారానే అపాయాన్ని నివారించాలి.. ఇలా ఓ బాలిక తన ఇంట్లో ఎదురైన ప్రమాదాన్ని అత్యంత చాకచక్యంగా తప్పించింది. టెక్నాలజీ సహాయంతో ఆ ప్రమాదాన్ని తరిమికొట్టింది. ఆ బాలిక చేసిన నెట్టింట వైరల్ గా మారింది. అది కాస్త సుప్రసిద్ధ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు తెలిసింది. ఆ బాలిక చేసిన పనికి ఆయన నోటి వెంట మాట రాలేదు. ఆమె ధైర్యసాహసాలు మెచ్చి మరో మాటకు తావు లేకుండా తన సంస్థలో జాబ్ ఆఫర్ ప్రకటించారు. ఇంతకీ ఆ బాలిక చేసిన పని ఏంటంటే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో 13 సంవత్సరాల నిఖిత అనే బాలిక తన కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఆ ప్రాంతంలో కోతులు బెడద చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో తన ఇంట్లోకి ప్రవేశించిన కోతులను భయపెట్టి బయటికి వెళ్లగొట్టింది. కోతులు ఆమె ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమాత్రం భయపడకుండా.. సమయస్ఫూర్తితో ఆలోచించింది. ధైర్యంగా ఎదుర్కొంది. నిఖిత ఇంట్లోకి అతిథులు రావడంతో గేటు తెరిచి ఉంది. ఆ సమయంలో కోతులు నిఖిత వంట గదిలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత అందులో ఉన్న వస్తువులను చిందరవందర చేశాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు భయపడ్డారు. కానీ నిఖిత ఏమాత్రం భయపడకుండా.. సమయస్ఫూర్తితో ఆలోచించింది. వెంటనే అలెక్సా ను కుక్కలాగా శబ్దం చేయమని ఆదేశించింది. అలెక్సా అచ్చం కుక్కలాగా అరవడంతో కోతులు అక్కడి నుంచి పారిపోయాయి.

నిఖిత కోతుల నుంచి తనను, ఇతర బంధువుల పిల్లలను కాపాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ ద్వారా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనను అనుసరించే ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ” సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనుషులు బానిసలుగా మారతారా? లేదా దానిని ఉపయోగించుకోవడంలో మాస్టర్స్ అవుతారా? ఇది చాలా కఠినమైన ప్రశ్న.. 13 సంవత్సరాల అమ్మాయి వేగంగా ఆలోచించి అలెక్సాను ఉపయోగించింది. దానిద్వారా కుక్కలాగా అరిపించింది. ఫలితంగా కోతులు కిష్కింధకాండను విరమించుకున్నాయి. నిఖితకు ప్రస్తుతం 13 సంవత్సరాలు. ఆమె తన చదువులు పూర్తయిన తర్వాత ఎప్పుడైనా కార్పోరేట్ ప్రపంచంలో పనిచేయాలని అనుకుంటే.. కచ్చితంగా ఆమెను మా సంస్థలో పనిచేసేందుకు ఒప్పిస్తామని ఆశిస్తున్నామని” ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.. నిఖిత ధైర్యసాహసాలను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. జాబ్ ఆఫర్ ప్రకటించిన ఆనంద్ మహీంద్రా ను అభినందిస్తున్నారు.