Interesting Story: జీవితంలో కష్టాలు ఉంటాయి. సుఖాలుంటాయి. ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రతి బంధకాలు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నింటినీ సులువుగా చేదించడం ఎవరికైనా అసాధ్యం. కాలం పెట్టే పరీక్షలో వీటన్నింటిని దాటుకొస్తేనే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుంది. కొందరు ఈ కష్టాలను చూసి ఇబ్బంది పడతారు. మరికొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు. అలా ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మనిషి.. ఒకానొక సందర్భంలో కోడలి చేతిలో చీత్కరింపునకు గురయ్యాడు. చివరికి కొడుకు ద్వారా ఆ గౌరవాన్ని పొందాడు.
Also Read: స్పిరిట్ సినిమాలో ఒక స్పెషల్ పాత్ర చేయడానికి ఆ స్టార్ హీరో ఫిక్సయ్యాడా..?
ఈ కథ చదువుతుంటే.. సినిమా స్టోరీ లాగా అనిపించవచ్చు. కాకపోతే నిజ జీవితంలో జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రాన్ని చెందిన వేముల రాజారామ్ కు ఓ కుమారుడు. ఇతడి భార్య అనారోగ్యం వల్ల చనిపోయింది. అప్పటికి రాజారామ్ కు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన వయసు కూడా 45 సంవత్సరాలు. రెండో పెళ్లి చేసుకోవాలని బంధువులు అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ అతడు వినిపించుకోలేదు. పైగా వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారాన్ని అతడు అభివృద్ధి చేశాడు. కొడుకు వంశీని పెంచి పెద్ద చేశాడు. ఉన్నత చదువులు చదివిన వంశీ కొద్ది రోజులపాటు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత అతనికి వివాహం చేయడంతో.. తన భార్యతో కలిసి పరకాల పట్టణ కేంద్రానికి వచ్చాడు. తన తండ్రితో పాటు ఒక వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు.
తండ్రికి అవమానం జరిగిందని..
రాజారామ్ కు మొదటి నుంచి అన్నంలో పెరుగు వేసుకొని తినడం అలవాటు. కొత్త కోడలు మొదట్లో అతడికి అలాగే అన్నం పెట్టేది. అయితే ఒక రోజు రాజారాం పెరుగు అడిగినప్పటికీ.. లేదని చెప్పింది. దీంతో అతడు సరే అనుకుని పడుకున్నాడు. ఈలోగా వంశీ వచ్చాడు.. అతని భార్యతో కలిసి అన్నం తిన్నాడు. పెరుగు అడిగితే ఆమె ఇంట్లో ఫ్రిజ్లో దాచిన పెరుగు గిన్నెను తీసుకొచ్చి అతడి ముందు పెట్టింది. పెరుగు గిన్నె నిండుగా కనిపించడంతో వంశీకి అనుమానం వచ్చింది. నాన్న ఇవాళ పెరుగు వేసుకోలేదా అని భార్యను అడిగితే.. దానికి ఆమె లేదు అని సమాధానం చెప్పింది. తన తండ్రి పెరుగు వేసుకోకుండా అన్నం తినడని వంశీకి తెలుసు. దీంతో అతడు పని మనుషుల ద్వారా విషయం తెలుసుకున్నాడు. మరుసటి రోజు తండ్రిని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అది వారి బంధువుల గ్రామం. అక్కడ ఒక ఇంట్లో రాజారామ్ ను ఉంచాడు.. రాజారామ్ కు రెండో పెళ్లి చేస్తున్నట్టు బంధువులకు చెప్పాడు. ఇదంతా నాటకమే అయినప్పటికీ నిజమే అన్నట్టుగా ప్రచారం చేశాడు. రాజారామ్ ఇంట్లో లేకపోయేసరికి అతడి గురించి వంశీని అడిగింది. దానికి అతడు సరిగ్గా సమాధానం చెప్పలేదు. దీంతో పని మనుషుల ద్వారా ఆమె రాజారామ్ కు రెండో పెళ్లి చేస్తున్న విషయం తెలుసుకుంది. తన మామయ్యకు భార్య వస్తే.. తనకు ఇబ్బందులు తప్పవని భావించిన ఆమె.. రాజారామ్ ఉంటున్న చోటు వద్దకు వెళ్ళింది. అతని రెండు కాళ్ల మీద పడి ప్రాధేయపడింది. క్షమించమని కోరింది. ఈ విషయం తెలియని రాజారామ్ అలానే చూస్తూ ఉండిపోయాడు. ఈ వ్యవహారం మొత్తం తెలిసిన వంశీ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత రాజారామ్ ను వంశీ ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని వంశీ భార్య తన మామయ్య 70వ జన్మదిన రోజున ఏర్పాటు చేసిన వేడుకలో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్త కళ్ళు తెరిపించాడని వాపోయింది. పరకాలలో కొన్ని నెలలపాటు వంశీ తండ్రి ఉదంతం చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోకి చేర్పించి.. బతికి ఉండగానే నరకం చూపిస్తున్న కొడుకులకు.. కోడళ్ళకు రాజారామ్ జీవితం ఒక గుణపాఠం లాగా నిలిచింది.
Also Read: ప్రభాస్ పుణ్యమాని కన్నప్ప కి భారీ బిజినెస్ జరుగుతుందా..?