Heart Transplant: మనిషిగా పుట్టాక ఏదో ఒకటి సాధించాలి.. మానవ సేవే మాధవ సేవ అంటారు.. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.. ఇతరులపై సానుభూతి చూపించాలి అంటారు పెద్దలు. మానవత్వంతో మెలగడం ద్వారా సమాజంలో గొప్ప గౌరవం దక్కుతుంది. అవయవదానం ద్వారా ఇటీవల చాలా మంది ఆదర్శంగా నిలుస్తూ గొప్ప గౌరవం పొందుతున్నారు. తాజాగా ఓ కుటుంబం మానవత్వం సరిహద్దులు దాటింది. భారతీయుడి గుండె దానంతో దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన యువతికి కొత్త జీవితం లభించింది.
ఏం జరిగిందంటే..
మానవత్వానికి సరిహద్దులు లేవని మరోసారి రుజువైంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను అమర్చి ప్రాణదానం చేశారు చెన్నైలోని ఓ హాస్పిటల్ వైద్యులు. అంతేకాదు ఈ ఆపరేషన్ చేసినందుకు వైద్యులు, హాస్పిటల్, ట్రస్ట్ ఆ యువతి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకపోవడం గమనార్హం. పాకిస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల రషన్ గుండె సంబంధ వ్యాధితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి విషమించడంతో ఇటీవల పరిశీలించిన వైద్యులు గుండె మార్పిడి చేయకుంటే బతకడం కష్టమని తేల్చారు. ఈ చికిత్సకు దాదాపు రూ.35 లక్షలకుపైగా ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో రషన్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రషన్‌ను ఆదుకునేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది.
చెన్నైలో సర్జరీ..
మన దాయాది దేశమైన పాకిస్థాన్ చెందిన రషన్‌కు భారత్‌లో ఆపరేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలోని నిపుణులను సంప్రదించింది. ఇందుకు ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు అంగీకరించారు. రషన్ గుండెను విజయవంతంగా మార్పు చేశారు. ‘ఇది ఓ గొప్ప సంఘటన.. ఎల్లలు దాటిన మానవత్వం. ఇందు కోసం యువతి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు’ అని వైద్యులు, హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం రషన్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. చనిపోతుందనుకున్న తమ కూతురు ప్రాణాలు నిలిపినందుకు రషన్ తల్లిదండ్రులు ట్రస్టు, ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్..
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె అమర్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇది కదా మానవత్వం అంటే.. శత్రువుకైనా సాయం చేయడమే భారతీయత. పాకిస్థాన్ యువతి శరీరంలో ఇప్పుడు భారతీయుడి గుండె శబ్దం వినబడుతోంది. ప్రపంచంలో మానవత్వం బతికే ఉంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.