Donation
Donation: లావుగా ఉన్నవారిని చూడగానే వారికి బలం ఎక్కువ అని భావిస్తాం. బక్క పల్చని వారు కనిపిస్తే ఇంత బలహీనంగా ఉన్నాడేంటి అనుకుంటాం. తెల్లగా ఉంటే ఒకలా.. నల్లగా ఉంటే మరోలా.. పొట్టిగా ఉంటే ఇంకోలా.. పొడవుగా ఉంటే ఇంకొకరకంగా మన ఆలోచనలు మారిపోతుంటాయి. అయితే మనుషుల ఆకారం, రంగును బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు. ప్రతి ఒక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఎవరి నైపుణ్యం వారిది. పుస్తకం అట్టను చూసి అది ఎలాంటిదో డిసైడ్ అయిపోకూడదో.. మనుషుల విషయంలోనూ అలాగే వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో సాదాసీదాగా ఉండేవారే.. అందరూ ఆశ్చర్యపోయే పని చేస్తారు. ఇందుకు తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
సాయం చేయడంలో నిజమైన సంతృప్తి..
నలుగురికి దానం చేస్తే.. మన దగ్గర మనీ అయిపోతుందేమో గానీ.. అందులో కలిగే సంతృప్తి వేరు అంటారు కొందరు. అలాంటి వారు సమాజానికి దాన ధర్మాలు చేస్తూ.. గొప్పవారు అనిపించుకుంటున్నారు. అలాంటి మహానుభావుడే.. తమిళనాడు.. మధురైకి చెందిన 82 ఏళ్ల చిరుతిళ్ల వ్యాపారి టీపీ.రాజేంద్రన్. ఆయన కార్పొరేషన్ స్కూళ్లకు రూ.1.8 కోట్లు విరాళంగా ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
బడి నిర్మించాలన్నిది ఆయన కల
పేద పిల్లల కోసం ఓ స్కూల్ నిర్మించాలన్నది రాజేంద్రన్ కల. అది నెరవేరలేదు. దాంతో.. మధురై కార్పొరేషన్ నడుపుతున్న రెండు స్కూళ్లకు భారీగా డబ్బులు విరాళంగా ఇచ్చారు. వయసు మీదపడుతున్న కొద్దీ చాలా మంది తన ఆస్తులను ఎవరికి ఎంత ఇవ్వాలని ఆలోచిస్తుంటారు. ఎనిమిది పదుల వయసు దాటిన రాజేంద్రన్ మాత్రం పిల్లలకు సాయం చేయాలనుకున్నాడు. వారి ఉన్నత చదువుకు తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చాడు.
5వ తరగతిలోనే చదువు ఆపేసి..
నిజానికి రాజేంద్రన్ ఐదో తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. 40 ఏళ్ల కిందట రకరకాల చిరుతిళ్లు అమ్మే వ్యాపారం ప్రారంభించారు. అప్పట్లో ఒక చిరుతిండి ప్యాకెట్ 10 పైసలు. అంటే రూపాయికి 10 ప్యాకెట్లు వచ్చేవి.1985 నుంచి వ్యాపారాన్ని పెంచుకుంటూ వచ్చాడు. వీలైనంతగా డబ్బు సేవ్ చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం తిరుపతి విలాస్ వతాల్(ఫ్రైడ్ స్నాక్స్) కంపెనీని తాతానేరీలో నడుపుతున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు అప్పడాలు, ఫ్రై డ్ స్నాక్స్, వడల వంటివి అమ్ముతోంది. ఇందులో రాజేంద్రన్‌తోపాటూ ఆయన ముగ్గురు కూతుర్లు, వారి ఫ్యామిలీలూ పనిచేస్తున్నాయి.
బడిలో సదుపాయాలు లేవని..
2018లో తిరువికా కార్పొరేషన్ స్కూల్‌లో సరైన సదుపాయాలు లేవని రాజేంద్రన్ తెలుసుకున్నాడు. రూ.1.1 కోట్లను విరాళంగా ఇచ్చిన రాజేంద్రన్.. ఇప్పుడు కైలాసపురం కార్పొరేషన్ ప్రైమరీ స్కూలుకి రూ.71లక్షలు దానం చేశారు. తాజాగా పట్టిమాండ్రమ్ స్పీకర్ సొలోమన్ పాపయ్య.. రాజేంద్రన్‌ను కలిసేందుకు రావడంతో.. పెద్దాయన చాలా ఆనందపడ్డారు. పాపయ్య కూడా తన వంతుగా రూ.20 లక్షలు.. మధురై లోని ఓ కార్పొరేషన్ స్కూలుకి డొనేట్ చేశారు. రాజేంద్రన్‌ను మెచ్చుకొని సత్కరించారు.
మధురై అభివృద్ధికి కూడా..
రాజేంద్రన్.. త్వరలోనే మధురై కమిషనర్‌ని కలుస్తాను అంటున్నారు. మధురై నగరాన్ని అభివృద్ధి చేయడానికి తాను ఏం చెయ్యాలో అడుగుతాను అంటున్నారు. ఓ ప్రపంచ స్థాయి మ్యూజియం అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చినట్లు రాజేంద్రన్ తెలిపారు.
సంపాదించిన సొమ్మును బ్యాంకులు, స్విస్ బ్యాంకుల్లో దాచుకుని తరతరాలు కూర్చొని తన్ని తరిగిపోనంతగా వెనకేసుకుంటున్న నేటి రోజుల్లో రాజేంద్రన్ చేసిన సాయం ఎంతో మంది పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తోప్పడుతుంది అనడంలో సందేహం లేదు.